మే 4, 2024

సంస్మరణః బూదరాజు రాధాకృష్ణ

Posted in భాషానందం, మన పాత్రికేయులు, సాహితీ సమాచారం వద్ద 3:59 సా. ద్వారా వసుంధర

శాస్త్రీయ భాషా పరిశోధనలో అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని భాషా శాస్త్రవేత్త, అభ్యుదయ సాహిత్యోద్యమకారుడు శ్రీ బూదరాజు రాధాకృష్ణ. వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ సంస్మరణ.

తెలుగు భాషా పదకోశాన్ని, వ్యవహారిక తెలుగు భాషా పదకోశాన్ని, ఈనాడు వ్యవహారిక భాషా పదకోశాన్ని ఆయన రూపొందించారు.ఈనాడు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం ప్రిన్సిపాల్‌గా పని చేసి అనేకమందిని తీర్చిదిద్ది ప్రస్తుతం ప్రముఖ పాత్రికేయులుగా రాణిస్తున్న వారి గురువు బూదరాజు రాధాకృష్ణ గారి జన్మదిన జ్ఞాపకం !

 🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం ప్రిన్సిపాల్‌గా పని చేశారు. తెలు భాషా పదకోశాన్ని, వ్యవహారిక తెలుగు భాషా పదకోశాన్ని, ఈనాడు వ్యవహారిక భాషా పదకోశాన్ని ఆయన రూపొందించారు. తెలుగు పత్రికా భాషకు ఒక రూపాన్ని ఇచ్చినవారిలో ఆయన మొదటి వరుసలో ఉంటారు. ఆయన జీవిత చరిత్ర ఇటీవల ప్రచురితమైంది. ఆయన పలు వ్యాసాలు కూడా రాశారు.
…..
బూదరాజు రాధాకృష్ణ గారు భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయుడు. పాత్రికేయులకు, భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించారు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.
…..
శాస్త్రీయ భాషా పరిశోధనలో అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని భాషా శాస్త్రవేత్త, అభ్యుదయ సాహిత్యోద్యమకారుడు, పాత్రికేయ గురువు బూదరాజు రాధాకృష్ణ గారు. నన్నయ పూర్వకాలంలోని శాసన భాషమీద, తెలుగు మాండలికాలపై వీరు చేసిన పరిశోధనలు, ఆధునిక వ్యవహారకోశం, ఈనాడు భాషా స్వరూపం, తెలుగు జాతీయాలు, వాడుక మాటలు లాంటి ఉపయుక్తమైన గ్రంథాలు ఆయన ప్రతిభాపాటవాలకు గీటురాళ్ళు. తెలుగు భాషాభివృద్ధికి వారు చేసిన కృషి మరువలేనిది.
…..
1932 మే 3 న ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామంలో రాధాకృష్ణ జన్మించాడు. హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్‌స్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టా అందుకున్నాడు. చీరాల వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టరుగా పనిచేశాడు. 1988లో తెలుగు అకాడమీలో పదవీ విరమణ చేశాక, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్ గా పదేళ్ళకు పైగా పనిచేశాడు. ఈనాడు పత్రికలో పుణ్యభూమి శీర్షికన సి. ధర్మారావు పేరుతో వందలాది వ్యాసాలు రాశాడు. ఆయన తన సాహిత్య ప్రస్థానంలో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించారు.
…..
మహాకవి శ్రీశ్రీ అనే పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం 1999లో ఆంగ్లంలో రచించాడు. దాన్ని ఆయనే తెలుగులోకి అనువదించాడు. కేంద్ర సాహిత్య అకాడమీ ముఖ్యమైన భారతీయ భాషలన్నిటిలోకీ అనువదించి భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన ప్రచురించారు.
…..
బూదరాజు గారి “మరవరాని మాటలు.” ఇంగ్లీషులో Dictionary of Quotations లాంటిది. అయిదువేలకి పైగా గ్రంథాలను పరిశీలించి, నాలుగు వందల మందికి పైగా – నన్నయ నుండి చండీదాస్ దాకా – రాసిన రచనల్లోంచి, నాలుగు కాలాల పాటు నిలిచే రచయితల మాటలని సంకలన పరచారు.
ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ, తెలుగు సాహిత్యంలో వైవిధ్యలేమిని బూదరాజు గారు నిష్కర్షగా వివరించారు: “కవి, కవిత, స్త్రీ, ప్రేమ, జీవితం వంటి సర్వసాధారణ విషయాలను ప్రస్తావించిన వాళ్ళ సంఖ్య అపారం. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలనూ ఆధునిక సమాజం సంభావించే విషయాలనూ విమర్శించిన, వివరించిన వాళ్ళ సంఖ్య తక్కువ.”

  • వేటపాలెం “సారస్వత నికేతన” గ్రంథాలయం విశిష్టత …….

బూదరాజు గారు వేటపాలెం గ్రామ వాస్తవ్యుడు. కావడం. వేటపాలెం చీరాల పట్టాణానికి అయిదారు మైళ్ళ దూరంలో వున్న వేటపాలెం చీరాల పట్టాణానికి అయిదారు మైళ్ళ దూరంలో వున్న గ్రామం. ఆ ఊరు “జీడిపప్పు”కి పెట్టినపేరు. అంతకన్నా గొప్ప పేరు గలది ఆ వూళ్ళోని “సారస్వత నికేతన” గ్రంథాలయం – మన రాష్ట్రంలో కెల్లా చరిత్రాత్మకమైనది. అది ఈ పుస్తకంలో అనేకసార్లు ప్రస్తావనలోకొస్తొంది. దానికి 1929లో మహాత్మాగాంధీ శంకుస్థాపన చేశారు. నిజానికి చీరాలలో కన్నా వేటపాలెం లోనే సాంస్కృతిక వాతావరణం ఎక్కువ; అందుకు కేంద్రం గ్రంథాలయమే. డబ్బూ, చదువుకోడానికి సమయమూ అంతగాలేని అనేకమంది పౌరులు ఈ సమావేశాలకి వచ్చి పెద్దలని గూడా తమ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేవాళ్ళు.
…..
ఒకసారి తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ప్రసంగించడానికి వచ్చారు. ఆయన మాట్లాడటం మొదలు పెట్టీ పెట్టక ముందే, ఒక సభ్యుడు లేచి, “అయ్యా, తిక్కన భారతం లో మీ దృష్టిలో చెత్తపద్యమనిపించే దొకటి చదివి, మీరు రాసిన మంచి పద్యం కూడా చదివి, మీరే విధంగా అభినవ తిక్కన బిరుదుకు తగిన వారో వివరించి మాకు జ్ఞానం ప్రసాదించండి” అన్నాడు. “ఎవరో ఒక నిండు సభలో ఇస్తే కాదనలేక తీసుకున్నాను గాని, నేనంతటి వాణ్ణి కాదు” అని తుమ్మల సమాధానం ఇచ్చారు. తుమ్మల వారి వినయం, సభ్యుడి తెంపరితనం ఈ కాలపు సభల్లో వింటామా? కంటామా? అంటారు బూదరాజు.
…..
వేటపాలెం లోని సారస్వత నికేతన్ బూదరాజుగారికి మొదటి విశ్వవిద్యాలయం అయితే, రెండోది, ఇంటర్మీడియట్ చదవటానికి గుంటూరు వెళ్ళినప్పుడు, అక్కడి రైల్వేస్టేషన్. స్టేషన్ ఆవరణలో అమరావతి రోడ్డువైపున్న ఖాళీ స్థలంలో రోజూ సాహితీగోష్ఠి జరిగేది. గుంటూరులోని సాహితీకారులేకాక, చుట్టుపక్కల అమరావతి, నరసరావుపేట నుండి కూడా వచ్చి పాల్గొనేవారు. కరుణశ్రీ, జాషువా, కుందుర్తి, బెల్లంకొండ, శిష్ట్లా, ముదిగొండ, అమరేంద్ర మొదలైనవాళ్ళంతా అలా పరిచయమయిన వాళ్ళే.

  • జాషువా సంరక్షణలో….

మలేరియాతో మంచానపడితే నాలుగురోజులు అంటిపెట్టుకొని కాపాడిన జాషువా సంరక్షణ మరిచిపోలేనిది. “జాషువా కవిత్వం రవ్వలు రాలుస్తుందిగాని ఆయన మాత్రం పరమసౌమ్య శాంతమూర్తి. మీసాలూ కోటూ ఆయన నిజస్వరూపాన్ని మార్చి చూపుతాయి,” అంటారు బూదరాజు. జాషువా ఈలవేసి సంప్రదాయ నాటకరంగ పద్ధతిలో పద్యగానం చేస్తుంటే గుంటూరు ప్రజలు గుంపులు గుంపులుగా చూసేవాళ్ళు. అప్పటినుంచీ వున్న కవితా వ్యసనం బూదరాజు గారినెప్పటికీ వదల్లేదు.

  • ఆవేశంతో తెలంగాణా పోరాట దళాల్లో చేరడానికి కూడా సాహసించారు…..

ఆయన హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు తెలంగాణా పోరాట సమయం. కమ్యూనిస్టు మహా నాయకులిద్దరు – పుచ్చలపల్లి సుందరయ్య, బద్దె ఎల్లారెడ్ది – వేటపాలెం ఊరికి పడమట తోటల్లో రహస్య జీవనం మొదలెట్టారు. తూర్పున పొలాల్లో గుడిసెలో బూదరాజు గారి దూరపు బంధువూ కమ్యూనిస్టూ అయిన కస్తూరి కుటుంబరావు గారు భూగర్భ జీవనం గడుపుతున్నారు.
……
వీళ్ళిక్కడ దాక్కున్నారని తెలిసినా ఎంత వెతికినా స్థానిక పోలీసులకి దొరక్కపోతే మలబార్ పోలీసులు వచ్చి వూళ్ళోవాళ్ళని వేధించడం మొదలెట్టారు. ఆ బాధ పడలేక సారస్వత నికేతనం కార్యదర్శి మధ్యవర్తిత్వంతో రాజీ కుదిరిస్తే కుటుంబరావు గారు పిస్టలు ఇచ్చేశారు. అరెస్టు చేసి విచారణ చేస్తామని మాట ఇచ్చిన పోలీసులు వెంటనే ఆయన్ని అక్కడే వేలమంది కళ్ళ ఎదుటే కాల్చి చంపి, ఒంగోలు సమీపం లోని చింతలపాలెం లోని చింతలతోపులో పోలీసులతో హోరాహోరీ పోరాడి మరణించాడని పేపర్లో, రేడియోలో ప్రకటించారు!
…..
బూదరాజు గారికి మనసు విరిగి, కాంగ్రెసు మీదా ప్రభుత్వం మీదా ద్వేషం కలిగి, పగ తీర్చుకోడానికి తెలంగాణా పోరాట దళాల్లో చేరడానికి కూడా సాహసించారు. అడవిపట్టున నాలుగు రోజులుండేటప్పటికి ఆ వాతావరణం వొంటికి పడకపోవడంతో బుద్ధొచ్చి ఇంటికి చేరుకున్నారు

  • Science వెలగబెట్టాల్సినవాడు ఎందుకు తెలుగు తగలేశాడు ?

వాల్టేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చేరిన బూదరాజు, B.Sc., Honors లో సీట్లు సిఫారసు వున్న వాళ్ళకే ఇస్తున్నందుకు ప్రొఫెసర్ తో ఎదురుతిరిగారు. ఆయన, క్రమశిక్షణ పాటించనందుకు వెళ్ళగొట్టి, “ఈ యూనివర్సిటీలో నీకు పుట్టగతులుండవు” అని బెదిరించాడు. “నా ఇష్టం వచ్చిన మరో కోర్సులో చేరి ఈ మూడేళ్ళూ నిన్ను నిద్రపోనీ” నని బూదరాజు శపథం చేశారు. ఆ విధంగా “Science వెలగబెట్టాల్సినవాడు తెలుగు తగలేస్తున్నాడ”ని ఇంట్లో వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది.
……
ఒకరోజు గ్రంథాలయంలో సరయిన తెలుగు పుస్తకాలేమీ కనిపించక నిరుత్సాహపడి, తిరిగివస్తూ, ఓ సంస్కృత మూలగ్రంథం కనిపిస్తే, షెల్ఫ్ నుంచి తీశాడో లేదో, తనకి రెండేళ్ళు సీనియర్ అయిన నాయని కృష్ణకుమారి గారు నిలవేసి, “నీకేమర్థమవుతుంది? నాకవసరం” అని లాక్కోబోయారు. “నాకు అర్థమవుతుందో కాదో తేల్చే అధికారం మీకేముంది?” అని బూదరాజు రెట్టించారు. ఈ గొడవ విని లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణరావు గారు పరిగెత్తుకొచ్చి సర్దిపుచ్చారు.
ఆతరవాత బూదరాజు అబ్బూరిగారి కుటుంబసభ్యుల్లో ఒకరన్నంతగా దగ్గరయారు. అబ్బూరి ప్రభావం శ్రీశ్రీ మీద వున్నట్లే బూదరాజుమీద గూడా పడింది. భాషని ప్రత్యేక విషయం గాతీసుకోడానికీ, “క్షుద్రవిషయాలకు గ్రాంథికం వాడి గొప్పవాటికి వాడుకభాష వాడాలనే” నిర్ణయానికీ అబ్బూరే దోహదం.
…..
సాహితీ రంగాల్లోనే కాక, విద్యార్థి రాజకీయాల్లోనూ అనేకరకలైన గొడవల్లోనూ తలదూర్చి, పొట్టి శ్రీరాములుగారి ఆత్మార్పణ తర్వాత జరిగిన పోలీసు కాల్పులతో చివరకి పోలీసు రికార్డుల్లో బూదరాజు పేరు చిరస్థాయిగా చేరిపోయింది. విద్యార్థి దశతర్వాత ఆయన రాజకీయాల్లో పాల్గొనలేదు.

బూదరాజుగారి వ్యక్తిత్వాన్ని బాగా ప్రతిఫలించే సంఘటన ఒకటుంది. దానిని ఆయన మాటల్లోనే పూర్తిగా చదివితే రక్తి కడుతుంది. పరిశోధన కాలంలో 1961 వేసవినాటి ఒకానొక అనుభవం నేను జీవితాంతం మరిచిపోలేనిది. ఇంటి పనిమీద వేటపాలెం వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు దర్జాగా సెకండు క్లాసులో బయలుదేరాను. విజయవాడ నుంచి పార్సిల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం. రాత్రి ఏడెనెమిది గంటల సమయంలో రైలెక్కాను. పెట్టెలో ఎవరూలేరు. పైన పక్కపరిచి ఎవరూ రాకపోతే కింది బెర్తుమీద పడుకుందామని అదీ ఆక్రమించాను. పెట్టెలో ఉండేవే నాలుగు బెర్తులు. ఓ పావుగంట తరవాత ఇద్దరు సామానుతో ఎక్కి రెండోవైపు పక్కలు పరిచారు.
…..
మరో పది నిమిషాల్లో రైలు బయలుదేరుతుందనగా విశ్వనాథ సత్యనారాయణగారు ఎక్కారు. ఆయన్ను నేను గుర్తించాను గాని నేనెవరో ఆయనకు తెలియదు. ఆయన రచనలకన్నా ఎన్నో రెట్లు ఆయన వ్యక్తిత్వం గొప్పదనీ, కాని ప్రవర్తన విపరీతంగా కనిపిస్తుందనీ అబ్బూరి వారెప్పొడో చెప్పారు. ఆటపట్టించి చూద్దామనిపించింది.
….
మెడచాచి వంచి రెండు వేళ్ళు కలిపి ఒక వైపు విస్తరించి తుపుక్కున ఉమ్మి, “పైన ఎవరని” ప్రశ్నించాడాయన. “పరమాత్ము” డన్నాను. “కింద ఎవ”రన్నాడు. “అధమస్థుణ్ణి నేనున్నా”నన్నాను. “వాలకం చూస్తే తెలుగు మాస్టారు లాగుంది గాని ఈ వెధవ వేషమేమి?” టన్నాడు. “వేషాన్నిబట్టి విధవాత్వమాపాదించే మనం ఆ వేషధారులకు బానిసలుగా మూడు వందల ఏళ్ళున్నాం. ఆక్షేపించి సాధించేదేమి”టన్నాను. “పొగరుబోతులాగున్నావ్. నేను పెద్ద రౌడీనని తెలుసా?” అంటూ ఒక పక్క సంచీతో కూర్చున్నాడు.
……
“మనకు మిగిలింది పొగరే కదా. మా ఊళ్ళో నేనూ రౌడీనే”నన్నాను. “ఔరా! నీ శరీరపుష్టికి రౌడీయిజమా?” అంటే “డేవిడ్ శరీర పరిమాణం చిన్నదైనా గోలియత్ను పరాభివించలేదా?” అన్నాను. “నీవు కిరస్తానమా? ఏ వూరు మీది?” అని ప్రశ్నిస్తే మావూరేదో చెప్పి “అంగుష్ఠమాత్రః పురుషః” అన్నారు కదా. శరీర పరిమాణం ప్రధానమా?” అని అడిగాను. “సరే. సంగతి తేల్చుకుంటా. ఏ శాస్త్రం చదివావు? ఎందులో చర్చిస్తా”వన్నాడు. “వ్యాకరణంలోగాని, భాషాశాస్త్రంలోగాని పోరాడగల”నన్నా.
……
ఆ రెండో కూత కూయకు. నాకు అసహ్యం. భాషాశాస్త్రజ్ఞులమనే పాశ్చాత్య సేవకులు పాణిని అగౌరవించారు. మలేచ్చులు – వాళ్ళ మొహం చూడ”నన్నాడు. “అలాగయితే అటు తిరిగి కూర్చోండి. నేనుగూడా అపాణినీయ ప్రయోగాలు చేసే కవులను అసహ్యించుకుంటా”నన్నా. “ఆఁ” అంటుండగానే “నేను అంతో ఇంతో అష్టాధ్యాయి చదివా. అలాగే భాషాశాస్త్రం కూడా. ఆధునిక పాశ్చాత్య భాషా శాస్త్రజ్ఞులందరూ పాణిని ప్రాతస్మరణీయుడని గౌరవిస్తారు. పాణినికి దొంగదండాలు పెట్టి అప్రామాణిక ప్రయోగాలుచేసే వాళ్ళకన్నా బహిరంగంగా పాణిని పాతకాలపు వాడనే వాళ్ళు సజ్జనులు కాదా?” అని అడిగా.
……
క్రూరంగా చూసి, “ప్రేమాభిమానాలున్న చోట చీత్కారమూ ఉంటుంది. దేవుణ్ణి భక్తులు బహువిధాల దూషించారు. ఆపాటి తెలియదా?” అని నిలవేశాడు. “మీరు థూ. Shakespeare కూడా కవేనా? అని బహిరంగ సభలో ఈసడించింది భక్తి పారవశ్యంతోనా? మేం కలలో కూడా పాణిని మహర్షిని అలా అవమానించం. మేం అగౌరవించామనటానికి నిదర్శనముందా?” అన్నాను.
……
అప్పుడాయన “ఎవడో అజ్ఞాని, కానీ మీకు ఆరాధ్యుడు. బ్లూం ఫీల్డా వాడి పేరు? వాడికేం తెలిసి పాణిని భాషాజ్ఞానానికి సమాధి కట్టాడని కూశాడు?” అని ప్రశ్నించాడు. “మీరా బ్లూం ఫీల్డు పుసకం చదివి అందులో దూషించాడని గుర్తించారా?” అన్నాను. “నేను చదవలేదు. చదివిన వాళ్ళు చెప్తే నమ్మా”నన్నాడు. “అంత బాగా చదివి అర్థం చేసుకుని మీకు అబద్ధం చెప్పిన ఆ పండితుడెవరు?” అంటే “యూనివర్శిటీ తెలుగు శాఖలో ఉన్న .. గారు. మంచివాడు. నేనంటే బోలెడు అభిమానం. నాకాతడు అబద్ధాలూ, అప్రమాణాలూ చెప్ప”డని వివరించాడు. “ఆయనకు మీరంటే చాలా గొప్ప అభిమానమని నాకూ తెలుసు – నాకు నచ్చిన కవి విశ్వనాథ ఒకడు – అని రాసినవాడే కదూ?” అంటే “నీకెలా తెలుసా సంగతి?” అని నిలదీశాడు. “ఆ పద్యం ఆయన చదివిన సభలో నేనొక శ్రోతనో, ప్రేక్షకుణ్ణో. ఆ విషయం అలా ఉంచండి. బ్లూం ఫీల్డు రాసిన వాక్యం – Panini’s grammar is a monument of human intelligence – అన్నది. Monument అంటే ఏతాజ్ మహల్లాంటి గోరీయో అని అర్థం చేసుకున్న పండితుడి మాట నమ్మి మీరిలా మామీద ధ్వజమెత్తారు. చెప్పుడు మాటలు వినరాదనీ, విన్నా నమ్మరాదనీ మీకు తెలీదా?” అన్నాను.
……
వెంటనే లేచి నుంచుని “మీరు – ఆ బ్లూం ఫీల్డ్ మీరన్నట్లే రాశాడని సాక్ష్యం చూపితే – జీవితాంతం అతణ్ణి దగ్గరకు రానీను” అని క్షణమాగి “ఈ ప్రసంగం రావటమే మంచిదయింది. రేపు ఉదయం 10 గంటలకు నేను తెలుగు శాఖకు వస్తున్నా – ఆ సోమయాజి అంటే నాకు పడకపోయినా. అక్కడ లిఖిత నిదర్శనం చూపాలి. ఎవరిమాట నిజమో తేలేదాకా నేను మీ ఇంట్లోనే దిగుతానని రాశా గాని, …వింటికి పోను. మా అన్న గారింటికి వెళ్తా – పిలవని పేరంటంగానైనా” అన్నాడు. “మీ అన్నగారెవ”రంటే “మల్లంపల్లి వా”రన్నాడు. ఆరాత్రి ఇతర ప్రసంగాలతో ఎవరం నిద్రపోకుండా మాట్లాడుకున్నాం.
…….
తెలవారుజాము నాలుగున్నర గంటలయింది. ఆకస్మాత్తుగా నావైపు తిరిగి “ఓ గంట మాటలు కట్టిపెట్టు. నేను రాసుకోవాలి” అని సంచీలోంచి కాగితాల బొత్తితీసి యమ దీక్షతో నాలుగు పద్యాలు రాసి “ఇక రాయను. బుద్ధి మారింది. ఈ పద్యాలు విని నీ అభిప్రాయం చెప్పు. నీ పరిజ్ఞానమెంతో నాకుతెలుస్తుం”దన్నాడు. పద్యం సంగతి దేవుడెరుగు. ఆ కంఠమాధుర్యం. అందులోని ఒదుగూ పరమాద్భుతం. పక్కబెర్తుల వాళ్ళు లేచి విని ఆయనకు పాదాభివందనం చేశారు. “ఇప్పుడేమంటావ్?” అన్నాడు. “ఈ నాలుగు పద్యాల్లోనేగాక బహుశా మీ ఈ శతకం మొత్తంలో పరాకాష్ఠనందుకున్న భాగం ‘నేనెంత? నాబ్రతుకది యెంత?’ అన్న భాగం” అన్నాను. వెంటనే కౌగలించుకుని “నీవు పొగరుబోతువి, అలాగే. కానీ నానోరు మూయించావీ కూతకూసి. శ్రీ గిరిమల్లేశుణ్ణి ఆరాధిస్తూ మరో విధంగా రాయలేను – నా పొగరు చంపుకోకుండా. అదే కవిత్వమని కూసిన నిన్ను ఏం చెయ్యటానికీ వీల్లేదు. కానీ తుని వస్తున్నట్లుంది. ముఖ ప్రక్షాళనం కానీ. నా చేత్తో నీకు ఇడ్లీలు తినిపిస్తా”నని తొందరపెట్టి అంత పనీ చేశాడు!
…….
కలిసి బయలుదేరాం. మల్లంపల్లి వారింట్లో దించి వస్తుంటే “అన్నా! వీడు నాకు సరిపాత కొత్త స్నేహితుడు – లేదా సరికొత్త పాత స్నేహితుడు. సాయంత్రం కావ్యగోష్ఠికి రమ్మను” అన్నాడు. “సరే”నన్నా. బ్లూం ఫీల్డు రాసింది చూపా. ఆ సాయంత్రం మల్లంపల్లి వారింటికి వెళ్ళా. కిష్కింధాకాండ రాస్తున్నాడు. చదువుతూ మధ్యమధ్య నావైపు చూస్తుంటే నాకే ఇబ్బందిగా ఉంది. నిశ్చలంగా బండరాయిలా కూర్చున్నా. కొంతసేపటికి సుగ్రీవ విషాదఘట్టం వచ్చింది. సీతాన్వేషణకు కోతిమూకను పంపి, అంతకన్నా రాముడికేమీ చేయలేకపోయానన్న నిర్వేదంతో “ఒక వంద దిక్కులైనను లేవు” అనగానే నాతల తిరిగిపోయింది. “ఆఁ” అన్నాను. “అన్నా! బండరాయి కరిగింది. అపిగ్రావారోది త్యపి దళతి వజ్రస్య హృదయ”మన్నమాట నిజమే. ఇక చదవను. వీడు రాక్షసుడు. అయినా చలించాడు. నా కవితా తపస్సు నెరవేరినట్లే”నన్నాడు. ఈయన ఏం మనిషి? ఇది నిందాస్తుతి కిందకు వస్తుందా? స్తుతినింద అనాలా? అనే ప్రశ్న సహృదయులు మని చెప్పుకునే ఆలంకారికులకు కావాలి. నాకు మాత్రం మరపురాని అనుభూతి కలిగింది. విశ్వనాథ విచిత్ర వ్యక్తి. జెకిల్ అండ్ హైడ్ లాంటివాడా? పోల్చదగిన మరో వ్యక్తి లేడా నా ఎరికలో?”

  • బూదరాజుగారి చమత్కారం…

బూదరాజుగారు చాలా ప్రచురణలకి శ్రమపడటం, చివర్లో వాటి బాధ్యతని వేరే వాళ్ళకి అప్పగించి పేరొస్తే వాళ్ళకీ విమర్శలొస్తే ఈయనకీ పంచడం పరిపాటి. ఒకసారి తెలుగు అకాడెమి ప్రచురించిన తెలుగు సాహిత్యకోశంలో అనేక తప్పులున్నాయి – ఆంధ్రమహాభారత రచయితల్లో తిక్కన మూడోవాడు! – దీనికి బాధ్యులెవరని విధానపరిషత్తులో విమర్శలొచ్చాయి. ఒక గౌరవ సభ్యులు సదరు గ్రంథనిర్మాతను ఉరి తీయాలన్నారు. విద్యామంత్రి గారు బూదరాజుని సంప్రదిస్తే ఉరి తీయడమే మంచిదని ఒప్పుకున్నారు. హతాశుడైన మంత్రి గారు తెలుసుకున్నదేమిటంటే ఆ గ్రంథ పరిష్కర్త ఎవరోకాదు – ఆరోపించిన సభ్యుని కుమార్తె!

  • దిగజారిపోతున్న విద్యాప్రమాణాల పై కవిత్వం….

దిగజారిపోతున్న విద్యాప్రమాణాలని ఉదహరిస్తూ ఒక సంఘటన చెప్పారు. 1987లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో కథానికల మీద PhD చేస్తున్న అభ్యర్థుడొకరిని – విజయనగరం వాస్తవ్యుణ్ణి – బూదరాజుగారు, “మీ ఊళ్ళొనే తెలుగు కథ పుట్టిందంటారు. నిజమా?” అని ఎన్ని రకాలుగా అడిగినా ఆ విద్యార్థికి గురజాడ “దిద్దుబాటు” గుర్తురాలేదు. “పోనీ చా.సో. గారు తెలుసా?” అంటే ఆయన ఎవరన్నాడు. ఇలాంటి దుఃఖం కలిగినప్పుడల్లా ఏదోఒక వెకిలి పద్యం రాసుకోవడం అలవాటయిన బూదరాజు రాసిన పద్యం:

“చాగంటి సోమయాజుల
రోగం కుదిరింది; ఎవ్వరున్ విజినగరం
లో గుర్తించరు కథకు
ల్లో గొప్పని; కాలమెంతలో మారినదో?”

  • బూదరాజుగారిని చివరిదాకా బాధపెట్టిన విషయాలు……

బూదరాజుగారికి తెలుగువాళ్ళ చేతకానితనం మీద ఎంతో నిస్పృహ. మనకంటె చిన్న, పేద వాళ్ళయిన మళయాళ రాష్ట్రీయులు మహా నిఘంటువు కోసం కృషి చేయడం, ఇతర రాష్ట్రాలలో భాషా పండితులకున్న గౌరవం మనలో లేకపోవడం, మన చరిత్ర శాసనాలని సేకరించడంలో మన ప్రభుత్వానికున్న అలసత్వం, కాలం గడిచేకొలదీ అధికారుల పెత్తనం పెరగడం – ఇవన్నీ బూదరాజుగారిని చివరిదాకా బాధపెట్టిన విషయాలు.

  • రాధాకృష్ణ ప్రసిద్ధ రచనలు…

1) వ్యావహారిక భాషా వికాసం
2) సాహితీ వ్యాసాలు
3) భాషా శాస్త్ర వ్యాసాలు
4) పురాతన నామకోశం
5) జర్నలిజం – పరిచయం
6) నేటి తెలుగు – నివేదిక
7) మాటల మూటలు
8) మాటల వాడుక: వాడుక మాటలు
9) తెలుగు జాతీయాలు
10) ఈనాడు వ్యవహారకోశం
11) మాండలిక వృత్తి పదకోశం
12) తెలుగు శాసనాలు
13) సాగర శాస్త్రం
14) మహాకవి శ్రీ శ్రీ (ఇంగ్లీషు)
15) పరవస్తు చిన్నయ సూరి (ఇంగ్లీషు)
16) అకేషనల్ పేపర్స్
17) మంచి జర్నలిస్టు కావాలంటే
18) ఆధునిక వ్యవహార కోశం
19) మాటలూ – మార్పులూ
20) విన్నంత-కన్నంత (ఇది ఆయన ఆత్మకథ)
21) పుణ్యభూమి (ఈనాడులో వచ్చిన వ్యాసాల సంకలనం)
22) “మహాకవి శ్రీశ్రీ” – శ్రీశ్రీ జీవిత చరిత్ర (ఇంగ్లీషు). ఈ పుస్తకపు తెలుగు అనువాదం కూడా బూదరాజే చేశారు.

  • పురస్కారాలు…..

1993లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు.

  • మరణం……

2006, జూన్ 4 న బూదరాజు రాధాకృష్ణ మరణించాడు. మరణానంతరం ఆయన స్మృతి సంచికగా ఆయన శిష్య బృందం “సదా స్మరామి” అన్న పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకానికి గల ప్రత్యేకత ఏమిటంటే – ఆయన మరణించిన అయిదు రోజుల తరువాత అంటే జూన్ 9 న పుస్తకం ఆలోచన రూపుదిద్దుకుంటే, జూన్ 16 కల్లా ఆ పుస్తకం ముద్రణ పూర్తి అయి, విడుదలైంది.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.