ఏప్రిల్ 25, 2024

సంస్మరణః టంగుటూరి సూర్య కుమారి

Posted in సంగీత సమాచారం వద్ద 4:05 సా. ద్వారా వసుంధర

లంకె

దేశ, విదేశాల్లో రాణించిన గాయని

(నేడు టంగుటూరి సూర్య కుమారి వర్ధంతి )

టంగుటూరి సూర్య‌కుమారి.. ఈ పేరు వింటే చాలు తెలుగు నేల పుల‌క‌రించిపోతుంది.. తెలుగుపాట మురిసిపోతుంది.. గోదారి గుండె ఉప్పొంగుతుంది.. కృష్ణ‌మ్మ హృద‌యం ప‌ర‌వ‌శించిపోతుంది.. మాట‌లో పాట‌లో న‌ట‌న‌లో నాట్యంలో క‌ల‌కాలం మేటిగానే నిలిచారు సూర్య‌కుమారి. అస‌మాన ప్ర‌తిభ‌తో తెలుగు ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటారు.

అలనాటి ప్రముఖ నటి భానుమతి లాగా టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె నాట్యకారిణి, నటి, గాయని మాత్రమే కాదు మంచి వక్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు పాటనకి, తెలుగు భాషకి, భారతీయ నృత్యాలకి స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందడానికి ఆవిడ చేసిన కృషి అపూర్వం. అనన్య సామాన్యం. ప్రాచ్య, పాశ్చాత్య నృత్య, సంగీతాలకు మధ్య సుహృద్భావ సేతువుగా అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన మధురగాయని ఆమె.

పలు భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ, దేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. ప్రకాశం పంతులు ఆమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించి, శాస్త్రీయ సంగీతం నేర్పించాడు. ఆయన ఏ సభకు వెళ్ళినా ఆమెను తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవాడు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో, వందే మాతరం, మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు.

ఆమె 1925 నవంబర్ 13 నాడు రాజమండ్రిలో జన్మించింది. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు. 1937లో మద్రాసు వచ్చి, సినీరంగ ప్రవేశం చేసింది.1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఆమె సేవలను గుర్తించి సత్కరించింది. 1979లో రాజ్యలక్ష్మి అవార్డుతో ఆమెను గౌరవించింది. ఆమె ఏప్రిల్ 25, 2005 న లండనులో మరణించారు.

యం. రాం ప్రదీప్
తిరువూరు
9492712836

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.