ఫిబ్రవరి 4, 2014
ఆచార్య కొలకలూరి ఇనాక్తో ఇంటర్వ్యూ
ఈ ఇంటర్వ్యూ ఆంధ్రజ్యొతి దినపత్రిక ఫిబ్రవరి 3 సంచికలో వచ్చింది-
ఏప్రిల్ 7, 2013
శ్రీ కొమరగిరి సూర్యనారాయణ- జీవితసంగ్రహం
శ్రీ కొమరగిరి సూర్యనారాయణ 1957-58 మధ్యకాలంలో మా అభిమాన, ఆత్మీయ గురువు. ప్రస్తుతం మెహర్నగర్లో విశ్రాంతజీవితం గడుపుతున్న వారి గురించి గతంలో అక్షరజాలంలో ప్రస్తావించాం. ఎల్లుండి ఏప్రిల్ 9న వారి 81వ జన్మదినం. ఆ సందర్భంగా వారి తనయుడు తన వనరుల మేరకు వారి జీవిత సంగ్రహాన్ని ప్రచురించి మాకు అందజేశారు. వారికి మా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. భగవంతుడు వారికి ఆయురారోగ్య వైభోగాన్నివ్వాలని కోరుతూ- వారికి ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాం.
ఏప్రిల్ 9, 2012
శ్రీ కొమరిగిరికి గురుభ్యోన్నమః
గత సంవత్సరం (2011) మే నెలలో నా మేనల్లుడు నండూరి కామేశ్వరరావు పెళ్లికి తాపేశ్వరం వెళ్లాం. అక్కడికి దగ్గిర్లోనే మెహర్నగర్లో శ్రీ కొమరగిరి సూర్యనారాయణ ఉంటున్నారని నా అన్నయ్య జొన్నలగడ్డ నారాయణమూర్తి చెప్పాడు.
నేను, అన్నయ్య 6వ తరగతినుంచి ఒక సంవత్సరం రీసెర్చిదాకా సహాధ్యాయులం. ఆ విశేషాలు మరోసారి. 1957-58లో మేమిద్దరం ధవళేశ్వరం జిల్లాపరిషత్ హైస్కూలులో స్కూల్ఫైనల్ మొదటి బ్యాచి విద్యార్ధులం. మా తాతగారు పులుగుర్త వెంకట రామారావు అక్కడ సీినియర్ తెలుగు పండితులు. వారి విశేషాలు మరోసారి. హెడ్ మాస్టర్ మంథా సత్యనారాయణ, ఫస్ట్ అసిస్టెంట్ తటవర్తి సత్యనారాయణ, లెక్కల మేస్టారు రమణయ్య పంతులు, సోషల్ స్టడీస్ మేస్టారు కొమరగిరి సూర్యనారాయణ- అప్పటి టీచర్లలో ఇప్పటికీ గుర్తుండిపోయిన పేర్లు, వ్యక్తిత్వాలు. విద్యార్ధుల్ని కుటుంబ సభ్యులుగా భావించి, ఆదరించి, చేరదీసి, అనునయించి శిక్షణ ఇచ్చే ఆ తరం ఉపాధ్యాయుల శుశ్రూష ఫలితమే- నేటి మా వ్యకిత్వాలని భావిస్తాము.
రెండు మూడేళ్ల క్రితం శ్రీ కొమరగిరి సూర్యనారాయణ హైదరాబాదు వచ్చారు. తనకు తానుగా అన్నయ్యను కలిశారు. నాకు ఫోను చేెసి గుర్తున్నానా అనడిగితే- ఆమాటడగాల్సింది నేను- అని చెప్పాను. ఆయన నన్ను కలుసుకుందుకు వస్తానన్నారు. దూరం ఎక్కువని నేనే ఆయన్ను కలుస్తానన్నాను. కానీ నిర్ణీత సమయంలో ఒకరినొకరు కలుసుకోలేకపోయాం. ఇప్పుడు శ్రీ సూర్యనారాయణ మెహర్నగర్లో ఉన్నారని తెలియగానే నేను, అన్నయ్య వెంటనే వెళ్లి ఆయన్ను కలుసుకున్నాం.
మెహర్నగర్ ఓ ఋషివాటికలా ఉంది. అందులో ఆయన ఇల్లొక ఋష్యాశ్రమం. ఆయన వానప్రస్థంలో సకుటుంబంగా మహర్షిలా. ఆయనకు పేర్లతో సహా మేము గుర్తున్నాం. అప్పటి ఎన్నో విశేషాలు గుర్తున్నాయి.
మేస్టారి చూపుల్లో చల్లని వెన్నెలలు. మేస్టారి మాటల్లో చల్లని దీవెనలు. అభిమానం, ఆప్యాయత, ఆత్మీయతల ఉమ్మడి తాకిడితో- ఆయన్ను చూసిన అనుభూతి వర్ణనాతీతం. తిరుపతిలో శ్రీనివాసుని దర్శనంకంటే ఎక్కువ పరవశాన్నిచ్చిన ఆ భావానంతరం నాకూ, అన్నయ్యకూ అనిపించింది- ప్రతి విద్యార్ధికీ గురువే దైవం. జీవితంలో అప్పుడప్పుడైనా ఆ దైవదర్శనం అవసరం.
మేస్టారి జీవిత వివరాలు అక్షరజాలంలో ఉంచాలనిపించింది. ఆ విషయం ఆయనకి చెబితే వెంటనే ఇవ్వడానికి మొహమాట పడ్డారు. ఇటీవలే అవి నాకు అందాయి. ఆ వివరాలు మరోసారి.
ఈ రోజు ఏప్రిల్ 9. మేస్టారి 80వ జన్మదినం. ఈ సందర్భంగా వారికి ఆరోగ్య ఐశ్వర్యాలతో మరిన్ని దశాబ్దాల ఆయువును అర్ధించే మాతో గొంతు కలుపుతారని వారి ఫొటోని అక్షరజాలం వీక్షకుల ముందుంచుతున్నాను. ఈ తరహాలో గురుభ్యోన్నమః అనేవారికి అక్షరజాలం వేదిక కాగలదని మనవి!