ఫిబ్రవరి 25, 2020

తెలుగులో ఓ గొప్ప సినిమా c/o కంచరపాలెం

Posted in వెండి తెర ముచ్చట్లు వద్ద 7:31 సా. ద్వారా వసుంధర

.

నటీనటులు కొత్తవారు. వారికి మేకప్ లేదు

సినిమాకి సెట్టింగు లేదు. ఓ మామూలు పల్లెటూరే సెటింగు.

కథలో మసాలాలు లేవు. కథనంలోనూ మసాలా లేదు.

శృంగారానికి ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా – అతి సామాన్యమైన ప్రేమ జంటలు ఒకటి కాదు, రెండు కాదు – మొత్తం నాలుగు. అన్ని ప్రేమల్లోనూ తియ్యని బాధ ఉంది. అందని లోతులున్నాయి. వాటి ముగింపే సినిమాకీ ముగింపు. ఆ ముగింపు ఊహకందడం కష్టం. కానీ హిచ్‍కాక్ సినిమాకంటే ఎక్కువగా థ్రిల్ చేస్తుంది. ఆ తర్వాత ఆ ముగింపుకి సంబంధించిన పరవశం ప్రేక్షకుణ్ణి వెన్నాడుతుంది.

తెలుగులో ఇలా సినిమాలు తీసేవాళ్లున్నారా అన్నంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, సహజత్వంలో సత్యజిత్ రే వంటి బెంగాలీ బాబుల్ని కూడా నివ్వెరపరిచే ఈ చిత్రం – గత శతాబ్దపు శంకరాభరణంలా ఈ శతాబ్దానికో మైలురాయి.

ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ సదుపాయమున్నవారికి టివిలో సులభంగా అందుబాటులోకొస్తుంది. మిగతావారు అంతర్జాలంలో ప్రయత్నించుకోవాలి.

చలన చిత్రాల్ని అభిమానించేవారు తప్పక చూడాలి. మంచి చిత్రాలకోసం తపించేవారు ఈ చిత్రాన్ని చూడకపోతే అది వారికో పెద్ద లోటు.

ఈ చిత్రం చూసినప్పుడు మాకు కలిగిన స్పందనని పంచుకోవడమే ఈ టపా ఉద్దేశ్యం.

ఇతర వివరాలు వికీలో లభిస్తాయి. లంకెః https://en.wikipedia.org/wiki/C/o_Kancharapalem

డిసెంబర్ 31, 2018

భువినుండి దివికి

Posted in వెండి తెర ముచ్చట్లు, Uncategorized వద్ద 3:18 సా. ద్వారా వసుంధర

mrinal sen

మే 6, 2018

భరత్ అనే నేను – ఒక స్పందన

Posted in వెండి తెర ముచ్చట్లు, Uncategorized వద్ద 9:29 సా. ద్వారా వసుంధర

bharat-ane-nenu poster

బొమ్మకు లంకె

చిత్రసమీక్ష

ట్రైలర్

అతినీతిపరుడికి అధికారం చేతిలో ఉంటే ఒక్కరోజులో అవినీతిని ఎలా అణిచెయ్యొచ్చో చెప్పింది గతంలో ఒకేఒక్కడు చిత్రం. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన అతినీతిపరుడు అవినీతిని ఎదుర్కొనే సమస్యల్ని వాస్తవంగా ప్రదర్శించింది లీడర్ చిత్రం. ఇలాంటి చిత్రాల కోవలోకే వస్తుంది ఈ ఏప్రిల్ 20న విడుదలైన భరత్ అనే నేను చిత్రం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హఠాన్మరణం చెందడంతో – నాయకత్వం కోసం పోరాటం మొదలై ఆ పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. పార్టీని నడిపే నానాజీ ఈ సమస్యని పరిష్కరించడానికి – లండన్లో డిగ్రీలమీద డిగ్రీలు చదివేస్తూ I don’t know అని పాడుకుంటూండే భరత్‍ని ఇండియా రప్పిస్తాడు. అతడు ముఖ్యమంత్రి కొడుకు. చదువు తప్ప మరే విషయంమీదా ఆసక్తి లేని భరత్ అనాసక్తంగానే ఆ పదవిని చేపట్టాడు. ఏదైనా ప్రమాణం చేస్తే మాట తప్పకూడదని చిన్నప్పుడు తల్లి చేసిన ప్రబోధం అతడికి బాగా వంటబట్టింది. అందువల్ల ‘భరత్ అనే నేను’ అంటూ పదవికి ప్రమాణస్వీకారం చేసినప్పుడు – ఆ ప్రమాణానికి కట్టుబడి చిత్తశుద్ధితో బాధ్యతను నిర్వహించడం మొదలెట్టాడు. అందువల్ల అతడు సీనియర్ నేతల గుప్పెట్లో ఇమడలేదు సరికదా –  అధిష్ఠానాన్ని ఎదిరించడానికి కూడా వెనుకాడలేదు.

ప్రజలు అమాయకులు, బాధ్యతారాహిత్యానికి అలవాటుపడ్డవారు. నేతలు అవకాశవాదులు. రాష్ట్రమంతా అవినీతి. రాజకీయమంతా కుట్రలు, దగా, మోసం, దౌర్జన్యం, స్వార్థం.

తలచుకుంటే ఈ సమస్యలకి పరిష్కారం ఎంత సులభమో నేతలకే కాదు, అమాయకులనుకునే ప్రజలందరికీ కూడా తెలుసు. అది నిరూపించడమే ఈ చిత్రంలో భరత్ ఆశయం.

మచ్చుకి ట్రాపిక్ నియమోల్లంఘన, అవివీతిపరుల అమితబలం వంటి అంశాలను తీసుకున్న గొప్ప ప్రయోజనాత్మక సందేశాన్ని అందించిన చిత్రమిది. చిత్రం చూసినవారికి ఏమనిపిస్తుందంటే –

కథ కొత్తది కాదు. ఐనా మళ్లీ మళ్లీ చెప్పొచ్చు.

సమస్యల పరిష్కారాలు చూపించినంత సులభం కాదు. ఐనా ఓసారి వెన్ను తట్టి మందలించడానికి పనికొస్తాయి.

భరత్ అనే నేను – అన్న టైటిల్ ప్రమాణస్వీకారాన్ని ఎంత సీరియస్‍గా తీసుకోవాలో చెబుతుంది. చేసిన వాగ్దానాలనే మరుక్షణంలో మర్చిపోయే నాయకులకిది హెచ్చరిక. చిత్రానికి ఇంత మంచి పేరు పెట్టడం అభినందనీయం.

భరత్‍గా మహేష్ బాబు – చాలా హుందాగా ఉన్నాడు. తనకోసమే సినిమా చూడాలనిపించేటంత గొప్పగా ఉన్నాడు. కానీ ముఖంలో అణకువకంటే, అహం ఎక్కువ కనబడింది. ఐనా అభిమానులు కోరుకునేది అదే అని సరిపెట్టుకోవచ్చు. అలా సరిపెట్టుకుంటే – పాటల్లో డాన్సులు, ఫైట్లలో ఒక్కడు వందమందిని కొట్టడం కూడా ఓకే.

కెయిరా అద్వానీ ఎంబియ్యే చదివినా – హీరో తనని పెళ్లి చేసుకుంటాననడం ఒక గొప్ప వరంగా భావించడంవల్ల వ్యక్తిత్వం లేని మనిషి అనిపిస్తుంది. పాత్ర అలంకార ప్రాయమే ఐనా – అందంతోపాటు నటనా ప్రతిభ కూడా ఉన్నట్లు అనిపించడం విశేషం.

హీరో హీరోయిన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంలో ఉన్నప్పుడు – వారి ప్రేమ వ్యవహారం బయటపడ్డం ముఖ్యమంత్రి రాజీనామాకి దారి తియ్యాలా అనిపిస్తుంది. మన మీడియా అంత చిన్న విషయాన్ని కూడా పెద్దది చేస్తుందని దర్శకుని ఉద్దేశ్యమని సరిపెట్టుకోవచ్చు.

నానాజీ పాత్రచిత్రణ, నానాజీగా ప్రకాష్‍రాజ్ పాత్రపోషణ అద్భుతం. ఉన్నది కొన్ని క్షణాలే ఐనా భరత్ తల్లిగా ఆమని ఓ మెరుపులా పెరిసింది. చిత్రంలోని నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

ఇందులో చూపించిన అసెంబ్లీ సన్నివేశాలు, మీడియాలో big debate పేరిట జరిగే వ్యర్థ చర్చలు – వగైరాల చిత్రీకరణ కొందరికి చెంపపెట్టు. ఇందులో కనిపించే ఓ అవినీతి కుటుంబం సమకాలీనుల్ని గుర్తు చేస్తుంది. ముఖ్యమంత్రి హఠాన్మరణపు సన్నివేశం – తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇలాగే చనిపోయిందా అన్న భావాన్ని కలిగిస్తుంది.

ఇది తెలుగువారి కథ. పాత్రల్లో, సన్నివేశాల్లో, మాటల్లో కనిపించిన తెలుగుతనం – పాటల్లో ఏకోశానా లేకపోవడం విచారించాల్సిన విషయం. ప్రేక్షకులు అలాంటి సంగీతమే కోరుకుంటారని సరిపెట్టుకుందామంటే – అమిత ఆదరణ పొందిన రంగస్థలం చిత్రంలో పాటలు ఒప్పుకోనివ్వడం లేదు.

కథలో కొత్తదనం లేకపోయినా, కథనంలో లోతు లోపించినా – 173 నిముషాల చిత్రం అన్ని నిముషాలూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతినిస్తుంది. నిర్మాతనీ, దర్శకుణ్ణీ, నటీనటుల్నీ అభినందించాలనిపిస్తుంది. మహేష్‍బాబుమీద అభిమానం కలిగిస్తుంది. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి కానీ – అస్తమానూ ఇలాగే మాత్రం కాదుసుమా అనిపిస్తుంది.

మే 1, 2018

కణం – ఒక స్పందన

Posted in వెండి తెర ముచ్చట్లు, Uncategorized వద్ద 9:03 సా. ద్వారా వసుంధర

kanam poater

బొమ్మకు లంకె

చిత్ర సమీక్ష

ట్రైలర్

టీనేజి సాన్నిహిత్యంలో తొందరపడ్డం తప్పు కాకపోవచ్చు. కానీ గర్భస్రావం తప్పే కాదు, హత్య కూడా అని హెచ్చరించడం కథాంశం.

పాటలు లేవు. ఫైట్లు లేవు. సందేశత్మకమైనా భయానక చిత్రం. ఐతే భయం వేషధారణనుంచో, రక్తపాతంనుంచో పుట్టదు.

చిదిమితే పాలు కారే ఐదేళ్ల పసిపాప. ఆమెని చూస్తే జాలేస్తుంది, ముచ్చటేస్తుంది, భయమూ వేస్తుంది. ఎంతలా అంటే ఈ చిత్రంలో భయపెట్టేది ఆ పసిపాపే. కళ్లు నీలంగా కావు. గాలిలో తేలదు. వికటాట్టహాసాలు చెయ్యదు. 

జాలిగా చూస్తుంది. తల్లి పక్కన ఉన్నప్పుడు ఆమెను అనుకరిస్తుంది. బొమ్మలతో ఆడుకుంటుంది. తనకిష్టం లేనివారివంక కొంచెం కోపంగా చూసినా అది పసిపిల్ల కోపంలాగే ఉంటుంది. ఐనా సినిమాలో భయపెట్టే మనిషీ, అంశమూ తనే!

తెలుగులో హారర్ పిక్చర్సు ఇలా కూడా తియ్యొచ్చు అంటూ ఓ కొత్త ఒరవడి పెట్టిన కథనం ఈ చిత్రానికి ప్రత్యేకం. ఆ  కథనానికి అమిరిన నేపథ్య సంగీతం, అందాన్నిచ్చిన ఛాయాగ్రహణం శభాష్. గ్లామరుకి ఏ మాత్రం ప్రాధాన్యం లేని ఓ పాత్రని అత్యంత సహజం చేసిన సాయిపల్లవికి జోహార్లు. నటుడిగా కెరియర్‍కి ఏమాత్రం సహకరించని ఓ పాత్రని ఎంచుకుని, దానికి న్యాయం చేసినందుకు నాగశౌర్యకి అభినందనలు. ఒక పోలీసు ఇనస్పెక్టరు పాత్రని విలక్షణంగా, హృదయానికి హత్తుకునేలా ప్రదర్శించిన ప్రియదర్శికి హుర్రే! ఇక దియా అనే ఐదేళ్ల పసిపాప పాత్రని చిరస్మరణీయం చేసిన బేబీ వెరోనికా ఒక అద్భుతం.

ఈ చిత్రాన్ని చూసినవారు – గర్భస్రావం అనగానే ఉలిక్కిపడతారు. గొప్ప సందేశంతో, సమకాలీనులకు ప్రయోజనాత్మకమైన ఈ చిత్రం – హారర్ కోవకి ఓ గౌరవం.

గతంలో హిందీలో gauri – the unborn అనే చిత్రమొకటి ఇలాంటి కథాంశంతో హారర్ చిత్రంగా వచ్చినా – ఇది విభిన్నం.

ఈ చిత్రనిర్మాణానికి కారకులైనవారందరికీ అభినందనలు.

ఏప్రిల్ 30, 2018

కృష్ణార్జున యుద్ధం – ఒక స్పందన

Posted in వెండి తెర ముచ్చట్లు, Uncategorized వద్ద 9:01 సా. ద్వారా వసుంధర

krishnarjuna yuddham poster

బొమ్మకు లంకె

చిత్రసమీక్ష

ట్రైలర్

నటుడు హీరోగా ఒక ఇమేజ్ తెచ్చుకున్నప్పుడు – అతడిచేత ద్విపాత్రాభినయం చేయించడం ఒక బాక్సాఫీసు సూత్రం. ఆ సూత్రాన్ని అనుసరించినప్పుడు అందుకు తగిన కథని ఎంపిక చేసుకోవడం సబబు. గతంలో నందమూరి, అక్కినేని, కృష్ణ, శోభన్‍బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వగైరా పెద్ద హీరోలతో అలాంటి ఎన్నో చిత్రాలు వచ్చి జనాల్ని మెప్పించి ఘన విజయాలు సాధించాయి.

ద్విపాత్రాభినయమే కథ అనుకున్న చిత్రం ఒకటి కృష్ణార్జునయుద్ధం పేరిట – ఈ ఏప్రిల్ 12న విడుదలైంది.

ఈ చిత్రంలో కృష్ణ, అర్జున్‍లది ఒకే రూపం. కృష్ణ రాక్‍స్టార్‍గా చెకోస్లోవేకియాలో ఉంటాడు. అతడికి ఏ అమ్మాయైనా ఇట్టే పడిపోతూంతుంది. అమ్మాయిల్ని ఆకర్షించడానికి — నాటకాల్లో నటించే ప్రయత్నం చేస్తున్న అర్జున్‍ది పల్లెటూరు, అతడికి ఒక్క అమ్మాయి కూడా పడదు. ఈ ఇద్దర్నీ అక్కడా, ఇక్కడా పోలికలున్నసన్నివేశాల్లో చూపించడానికి ప్రయత్నిస్తూ తొలిసగం నడుస్తుంది. అసలు ఈ కథకి ప్రయోజనం ఏమిటీ అని అనుమానమొచ్చి రెండో సగమంతా – ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వ్యభిచారంకోసం అక్రమ రవాణా చేసే హృదయవిదారక అంశాన్ని – ఇంతవరకూ ఇంత unimpressiveగా ఎవ్వరూ తియ్యలేదు అనిపించే విధంగా ప్రదర్శించారు. సినిమా చూసినవారికి ఇందులో ద్విపాత్రాభినయం ప్రయోజనం ఏమిటీ అని అనుమానమొస్తుంది. నానిని project చెయ్యడం కోసమైతే కనుక – తొలిసారిగా నాని నటుడిగా తన ప్రత్యేకతని నిలుపుకోకపోవడం జరిగింది. పాత్రల ఎంపిక, నటన విషయంలో ఈ చిత్రం నానికి ఒక హెచ్చరిక కాగలదు.

అక్కడక్కడ దర్శకత్వ ప్రతిభ, ఓ నవ్వించే జోక్ లేకపోలేదు. 100 పేజీల పత్రికలో ఒకే ఒక్క జోక్ బాగుంటే – పాఠకులు ఇలా చూసి అలా పడేస్తారు కదా – ఈ చిత్రం విషయంలో ప్రేక్షకులూ అదే చేస్తే ఆశ్చర్యం లేదు.

తర్వాతి పేజీ