డిసెంబర్ 8, 2022
మాదుగుండు కృష్ణ
1988 నుంచి పత్రిక మూత పడేవరకూ- శ్రీ విజయ బాపినీడు మాకు బొమ్మరిల్లు పత్రికా నిర్వహణ (బొమ్మరిల్లు, ఒక సీరియల్ మినహాయించి) పూర్తి బాధ్యతలు అప్పగించారు. చాలామంది రచయితలు కథలు నేరుగా భువనేశ్వర్లో మా చిరునామాకే పంపేవారు. మద్రాసు ఆఫీసుకి వచ్చినవాటిని- కవరు కూడా విప్పకుండా మాకు బదిలీ చెస్తుండేవారు. చందమామలోని బాలసాహిత్యం కొన్ని పేర్లకు మాత్రమే పరిమితమైన ఆ రోజుల్లో- ఎందరో ఇతరుల విశిష్ట బాలసాహిత్యాన్ని చదివి, ప్రచురించే అవకాశం మాకు వచ్చింది. అలాంటివారిలో మాకు గుర్తున్న పేర్లలో కొన్ని- శ్రీయుతులు గుండ్రాతి సుబ్రహ్మణ్య గౌడు, డికె చదువులబాబు, ఆరుపల్లి గోవిందరాజులు, మాదుగుండు కృష్ణ, వక్కలంక కిషోర్, శ్రీమతులు ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి, జ్యోతిర్మయి. వీరిలో చాలామంది నేడు బాలసాహిత్యంలో విశిష్టులుగా గుర్తింపు పొందడం ఎంతో సంతోషంగా ఉంది. ఐతే అప్పట్లో మాకు వారి వ్యక్తిగత వివరాలు తెలియవు. శ్రీ పైడిమర్రి రామకృష్ణ పరిచయం చేస్తున్న బాలసాహితీశిల్పులు పుస్తకంలో శ్రీ మాదుగుండు కృష్న పరిచయం వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. పరిచయంతో పాటు- వారి ఒకొక్క కథ కూడా వేస్తే బాగుండేదేమో- కానీ ప్రచురణకర్తలు సాధకబాధకాలు- అర్థం చేసుకోగలం. శ్రీ రామకృష్ణకు అభినందనలు. మాదుగుం
పైడిమర్రి రామకృష్ణ (బాలసాహితీ శిల్పులు, వాట్సాప్) సౌజన్యంతో

మాదుగుండు కృష్ణ
“బాలసాహిత్యం రాయటం చాలా కష్టతరమైన ప్రక్రియ అని చెబుతుంటారు.కానీ నేను బాలసాహిత్యం రాయటంలో ఏనాడు కష్టపడలేదు.బహుశా పిల్లలకోసం ఇష్టపడి రాయటమే అందుకు కారణం కావచ్చు !” అంటారు మాదుగుండు కృష్ణ.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 08 జూన్ 1954లో శ్రీమతి తిమ్మక్క శ్రీ తిప్పన్న దంపతులకు జన్మించారు. ఆంధ్రాయూనివర్శిటీ నుంచి బి.ఎ పట్టా పొంది ఓ ప్రైవేటు సంస్థలో ఎకౌంటెంట్ మేనేజర్ గా పదవీ విరమణ పొందారు.
మాదుగుండు కృష్ణ బాలల కోసం ఎక్కువ కథలు రాశారు. 1980 లో ‘బాలమిత్ర’ బాలల మాస పత్రికలో మొదటి కథ ‘నిదర్శనం’ ప్రచురించబడింది.ఆ వెంటనే వీరి కథ బొమ్మరిల్లు లో చోటు చేసుకుంది. బుజ్జాయి, చిన్నారి వంటి బాలల మాస పత్రికల్లో ఒకే నెలలో రెండు, మూడు కథలు ప్రచురించబడేవి.చందమామకు కూడా కొన్ని కథలు రాశారు.
ఎమ్మిగనూరు చుట్టూ ఉండే చేనేత కార్మికులు, మంత్రాలయ రాఘవేంద్రుడు, అందమైన గుడికల్ వాటర్ టాంక్, తుంగభద్ర నదీ చుట్టూ ఎత్తైన కొండలు… ఇలాంటి ప్రశాంత వాతావరణం మాందుగుండు కృష్ణ తాత ఎక్కువగా బాలసాహిత్యం రాయటానికి తోడ్పడింది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పుట్టి ఆ ప్రాంతానికి తన రచనలద్వారా గుర్తింపు తీసుకొచ్చినా, జిల్లా రచయితలతో వీరికి అంతగా సాన్నిహిత్యం లేదు.
మొక్కలను మనం వంచగలం…కానీ చెట్టుని వంచలేము కదా..! బాలలకు వ్యక్తిత్వ వికాస కథలు చెప్పటం, చదివించటం ద్వారా చిన్నవయసులోనే వారికి చక్కటి విజ్ఞానాన్ని, వికాసాన్ని అందించి మంచి మార్గంలో నడిపించగల మని భావించి ఆదిశగా అనేక వ్యక్తిత్వ వికాస కథలు రాసారు.’నేర్చిన విద్య’ కథలో పెద్దలు చెప్పిన మాటలు వినకపోతే ఎలా కష్టపడతారో చెబితే, ఎదుటివారింటికి వచ్చిన పెళ్ళి సంబంధం చెడగొట్టి బంగారు అంగడి వుందని భావించి అంగడిలో పనిచేసే నౌకరుని తన కూతురుకి కట్టపెట్టి లబో దిబో అన్నసుగుణమ్మ దుర్భుద్దిని ‘పెద్దింటి సంబంధం’ కథలో చెబుతారు.
మాదుగుండు బాలలకోసం ఇంకా విలువైన బాలసాహిత్యం రావలసిన అవసరం ఎంతో వుందని భావిస్తారు.బాలసాహిత్య అభివృధ్ధికి తన వంతు సహకారం ఎప్పటికీ వుంటుందని, ప్రభుత్వం కూడా ఆర్ధికంగా సహకరిస్తే మరింత ఉన్నతమైన బాలసాహిత్యం మన బాలలకు అందించవచ్చని తెలిపారు.
ఒకప్పుడు అనేక బాలల పత్రికల్లో కథలు రాసి ప్రస్తుతం http://www.hubpages.com, http://www.triond.com, http://www.wikinut.com వంటి వెబ్ సైట్స్ ద్వారా బాలలకు తన రచనలు అందిస్తున్నారు మాదుగుండు కృష్ణ.
.వీరి ఇద్దరి కొడుకులు శాస్త్రవేత్తలు కావటం విశేషం
చిరునామా:
మాదుగుండు కృష్ణ
8- 406 ముగతి దేట
ఎమ్మిగనూరు – 518360
కర్నూలు – జిల్లా (ఏ.పి)
చరవాణి: 8019966260,
ఇమెయిల్ : krishnamadugundu@gmail.com
స్పందించండి