సెప్టెంబర్ 14, 2022

ఈ శతాబ్దపు పిల్లల తెలుగు కథలు

Posted in పుస్తకాలు, బాల బండారం, సాహితీ సమాచారం వద్ద 3:51 సా. ద్వారా వసుంధర

సమాజహితాన్ని కోరేది సాహిత్యం. నేటి బాలలే రేపటి పౌరులు. అలా బాలసాహిత్యం సమాజహితానికి పునాది. నవరసాలూ ఉండేది సాహిత్యం. రసం ఏదైనా ఆహ్లాదాన్నిచ్చేది బాలసాహిత్యం. అలాంటి బాలసాహిత్యాన్ని పురాణేతిహాసాలు, జానపద గాథలు, పత్రికలు వగైరాలు మనకు అందించాయి. అందిస్తున్నాయి. ఐతే ఆధునిక జీవన విధానం, సదుపాయాలు- నేడు అన్ని రకాల పాఠకుల్నీ పుస్తకపఠనానికి దూరం చేస్తున్నాయి. కానీ ఫాస్ట్‌ఫుడ్‌కి అలవాటుపడ్డవాళ్లకి ఇంటివంటలా- ఏదో రూపంలో సాహిత్యాస్వాదన అందరికీ తప్పనిసరి. ఇక ఆ ఇంటివంట పిండివంటలా రూపొందితే- వారిలో పఠనాసక్తి పెంపొందడం సహజం. అలాంటి ఓ పిండివంట- రచయిత్రి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి అందించిన  ‘మీను కథలు’.

ఈ సంపుటిలో కథలు ఇరవైరెండు. కథాకాలం ఇరవయ్యొకటో శతాబ్దం. నేపథ్యంలో పిల్లల బడి, ఇల్లు. ముఖ్యపాత్ర మీనూ స్కూల్లో చదివే చిన్న పాప. మిట్టూ ఆమె తమ్ముడు.

ఇవి చదివితే- ఇంట్లో పేరుకుపోయే చెత్తని ‘సైన్స్ ఎగ్జిబిషన్‌’కి వాడొచ్చు. అప్రమత్తతతో ప్రాణాలు కాపాడొచ్చు (సమయస్ఫూర్తి). ‘బర్త్‌డే పార్టీ’, ‘లైబ్రరీ’లతో- మనకంటే పేదవారిని సంతోషపెట్టొచ్చు. ‘ప్లాస్టిక్ సంచీలు’, ‘నీటి ఎద్దడి’ వగైరా సమస్యల్ని ఇంట్లోనే పరిష్కరించొచ్చు. పెద్దల ఆరోగ్యాన్ని కాపాడే వైద్య పరిజ్ఞానాన్ని అలవర్చుకోవచ్చు (మమ్మీ జ్వరం). తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు (దసరా సెలవులు, క్విజ్). నిరాడంబరతతో మెప్పించొచ్చు (తినుబండారాలు). సృజనకు చక్కని మార్గదర్శకాలు పొందవచ్చు (వందేమాతరం).

ఇంకా- ‘కథల పోటీ’ పుస్తకపఠనాన్నీ, ‘బొమ్మల అలమర’ ఆర్థికపరిస్థితులపట్ల అవగాహననీ, ‘డిక్షనరీ’ జ్ఞానసముపార్జననీ, ‘సోలార్ ఇస్త్రీపెట్టె’, ‘వినాయక చవితి’ పర్యావరణస్పృహనీ, ‘1098’ సామాజిక బాధ్యతనీ ప్రోత్సహిస్తే- ‘సగం నిండిన గ్లాసు’ ఉపయుక్త సమాచారాన్ని ప్రేరణగా అందిస్తుంది.

ఇలాంటి కథల్లో ముఖ్యపాత్రని ఎక్కువ చెయ్యడానికి, అనుబంధపాత్రని తక్కువ చెయ్యడం సాధారణం. మచ్చుకి 1950లలో ప్రాచుర్యమైన బాల మాసపత్రికలో ‘రాము-సోము’ అలాంటి శీర్షిక. వాటిలో సోము అన్నివిధాలా చెడ్డవాడు. రాము అన్నివిధాలా మంచివాడు. బాలల మనసుల్ని ప్రభావితం చెయ్యడానికి అదో పద్ధతి. ఈ కథల్లో మీను ని మిట్టూకంటే ఎక్కువ చేసినా- మిట్టూపట్ల చూపిన అవగాహన- ఈ తరానికి సముచితమైన మరో మంచి పద్ధతి. అంతేకాక- పెద్దలు ఆదర్శప్రాయులైతే వారి ప్రభావం పిన్నలపై ఉంటుందన్న సందేశాన్ని ఆ రెండు పాత్రలూ అందిస్తాయి. మచ్చుకి ‘కాలింగ్ బెల్’ కథలో మిట్టూ అక్కకి సారీ కూడా చెబుతాడు. ‘కార్టూన్ ఐడియా’లో మిట్టూ సృజన అక్క మెప్పుని పొందుతుంది. మిట్టూ అక్కని చూసి అసూయపడితే, అది ఆ వయసుకి సహజమైన బాల్యచాపల్యమే తప్ప ద్వేషం కాదు.

చక్కని నీతి, మంచి సందేశం, గొప్ప ప్రబోధం ఉన్నప్పటికీ- అన్నీ అంతర్లీనం కావడంవల్ల ఈ కథలన్నీ విశిష్టం. ఉదాహరణకి ‘బాంకు పని’ లో అసహాయులకు సాయపడాలన్న సందేశం అంతర్లీనం. నియమానికి లోబడే అనుకున్నది సాధించిన చమత్కారం ఆసక్తికరం; ‘రామచిలుకలు’ కథలోని సందేశానికి కథనం ఆహ్లాదపు పూత పూసింది. ‘ఇప్పుడు మీను ఉదయం చిలుకల సందడితో మొదలవుతోంది’ అన్న ముచ్చటైన ముగింపు వాక్యం ఎవరికైనా ముఖంమీదకి ముసిముసి నవ్వుల్ని రప్పించాల్సిందే!  

చిన్నప్పుడు రామకథని అమ్మ చెబుతుంటే- ఎన్నిసార్లు విన్నా విసుగనిపించేది కాదు సరికదా- మళ్లీ మళ్లీ వినాలనిపించేది. ‘మీను కథలు’ చదువుతుంటే చదివినట్లుండదు. అమ్మఒడిలో వాలి, ఆత్మీయతను ఆస్వాదిస్తూ వింటున్నట్లుంటుంది. సరళమై, మృదుమధురమై.   అలరించే భాష ఈ అపూర్వ కథనానికి కారణమనవచ్చు. చిన్నప్పుడు రేడియో అన్నయ్య-అక్కయ్య (శ్రీ న్యాపతి రాఘవరావు, శ్రీమతి కామేశ్వరి) నిర్వహించిన ‘బాల’ మాసపత్రికలో రచనలు, రేడియోలో పిల్లల కార్యక్రమాల్లో వినిపించిన కథలు-రూపకాల హుందాతనాన్ని గుర్తు చేసే ఈ కథలకు శ్రీ పి.ఎస్. బాలు వేసిన బొమ్మలు బంగారానికి పరిమళం అద్దాయి. బొమ్మలు-కథల అన్వయంతో- బొమ్మలు కథల్నీ, కథలు బొమ్మల్నీ స్ఫురింపజేస్తాయి. శ్రీ బాలు కి ప్రత్యేకాభినందనలు. ఇవి రేపటి పొరుల్ని నేటికీ, నేటి పౌరుల్నీ రేపటికీ సిద్ధపడేలా ప్రభావితం చేసే కథలు. సమకాలీన వాతావరణాన్ని ప్రతిఫలించిన ఈ శతాబ్దపు పిల్లల తెలుగు కథలు. బడిపిల్లలకు పాఠ్యాంశాలు కావాల్సిన కథలు. ‘మీను-మిట్టూ’ వంటి పాత్రలతో ఇలాంటి మరిన్ని విశిష్ట కథల్ని అందించి- సమాజహితానికి పునాదిని మరింత కట్టుదిట్టం చేస్తారని ఆశిస్తూ- రచయిత్రి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారికి హృదయపూర్వక అభివందనాలు, శుభాకాంక్షలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: