సెప్టెంబర్ 2, 2022

సంస్మరణః శ్రీ నండూరి రామమోహనరావు

Posted in మన పాత్రికేయులు, సాహితీ సమాచారం వద్ద 7:42 సా. ద్వారా వసుంధర

రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో

సైన్సు రచయితలకూ, సాహిత్య అనువాదకులకు ఆరాధ్యుడు నండూరి రామమోహనరావు వర్ధంతి ఈరోజు:

కొడవటిగంటి కుటుంబరావు గొప్ప రచయితే కాదు, గొప్ప సంపాదకుడు కూడా! అలాగే నార్ల వెంకటేశ్వరరావు గొప్ప సంపాదకుడే కాదు గొప్ప రచయిత కూడా!! అయినా మనం కొకును రచయితగా, నార్లను సంపాదకుడుగానే గుర్తుంచుకుంటున్నాం. వీరిద్దరిలాగే రెండు రంగాలలో రాణించి, ఈ ఇద్దరితో పనిచేసిన రచయిత, పాత్రికేయుడు, సంపాదకుడు నండూరి రామమోహనరావు. తనకు ఫస్ట్ లవ్ సాహిత్యం, సెకండ్ లవ్ సైన్స్ అని వీరు అంటారు. కానీ నండూరి రామమోహనరావును ‘విశ్వరూపం’, ‘నరావతారం’ రచయితగానే గుర్తుపెట్టుకుంటున్నాం. మార్క్ ట్వయిన్, లూయీస్ స్టీవెన్ సన్ వంటి వార్ల రచనలు రాజు-పేద, టాంసాయర్, విచిత్రవ్యక్తి, కాంచనద్వీపం పేరున హాయిగా అనువదించిన సాహితీవేత్త.
అంతేకాదు, యద్దనపూడి సులోచనారాణి వంటి వారిని తొలుత గుర్తించి, ప్రోత్సహించి, ఆదరించిన ఉదారవాది కూడా రామమోహనరావే. వారు సుమారు ఐదున్నర దశాబ్దాలపాటు పత్రికా రంగంలో పనిచేశారు. అయితే మొత్తం సర్వీసు రెండు పత్రికలు, రెండు నగరాలకు పరిమితం అయ్యింది. మొదటిది వీక్లీ జర్నలిజం కాగా, రెండవది డెయిలీ జర్నలిజం. ఇప్పటి పరుగులు తీసే తరానికి ఈ విషయాలు బోధపడటం కష్టం కావచ్చు.

1927 ఏప్రిల్ 24 న జన్మించిన రామమోహనరావు 2011సెప్టెంబర్ 2 న కనుమూశారు. రాజమండ్రిలో డిగ్రీ చదువుకునే సమయంలో సహాధ్యాయి కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం గారు ఎమర్జెన్సీ సమయంలో ‘ఆంధ్రప్రభ’ దినపత్రికకు సంపాదకులుగా పేరుగాంచిన పాత్రికేయులు.

నండూరి రామమోహనరావుగారిలో నెమ్మదిగా కష్టపడటం, నాజూకుగా చక్కదనాన్ని చెక్కడం చూడవచ్చు. పరుషంగా మాట్లాడటం కన్నా తనలో తనే ఇబ్బంది పడటం ఆయన మిత్రులకు బాగా తెలుసు. దానినే మరికొంతమంది సర్దుకుపోవడంగా పరిగణిస్తారు. 1996-2002 మధ్యకాలంలో నండూరి రామమోహన రావును చాలా తరచు కలిసేవాడిని. చాలా ఆదరంగా చూసేవారు, చాలా విషయాలు సందర్భోచితంగా చెపుతూండేవారు. చాలా సున్నితమైన వ్యక్తి. అందరితో హాయిగా ఉండలేని రోజులని పరోక్షంగా అంటూండేవారు.

వారు 21 సంవత్సరాల వయస్సులో 1948లో మద్రాసు ఆంధ్రపత్రిక ఉద్యోగంలో చేరారు. అక్కడ మహామహులైనవారు పనిచేసేవారు.. కొడవటిగంటి కుటుంబరావుగారు ఆంధ్రపత్రిక వీక్లీలో పలు మార్పులు చేసి, సర్క్యులేషన్ పెంచి పిమ్మట ‘చందమామ’ పత్రికలో చేరిపోయారు. దాంతో నండూరి రామమోహనరావుగారి సామర్థ్యానికి పెద్ద అవకాశం దొరికింది. వారు మద్రాసులో ఒక పుష్కరం మించి పనిచేసినపుడు జర్నలిజంలో, రచనలో పునాది గట్టిగా పడింది. ఆ సమయంలోనే పలు ప్రసిద్ధమైన ఆంగ్ల నవలలు చక్కని తెలుగులోకి అనువాదం చేశారు. ఈ ప్రయత్నాలే వారి సాహిత్య స్థానాన్ని భద్రపరిచాయి. విమర్శకుడిగా పేరు తర్వాత వచ్చింది. నండూరి వారి ప్రతిభను పోటీపత్రిక నుంచి గమనించారు నార్ల వెంకటేశ్వరరావు. 1960లో విజయవాడ నుంచి కొత్త పత్రిక ‘ఆంధ్ర జ్యోతి’ ప్రారంభించినపుడు నండూరిని నార్ల ఆహ్వానించి, అవకాశం కల్పించారు. ఆ పత్రికలో 34 సంవత్సరాలు పనిచేశారు రామమోహనరావు.

కొకు సారథ్యంలో ప్రఖ్యాత నవలల అనువాదాలు ప్రారంభిస్తే, నార్ల నాయకత్వంలో మంచి సైన్స్ రచననలు చేశారు. రామమోహనరావుగారి పరిశీలన చాలా విశేషమైంది. నార్ల షష్ఠిపూర్తి సందర్భంగా వెలువడిన ‘ది స్టడీస్ యిన్ తెలుగు జర్నలిజం’ సంకలనంలో తెలుగులో ప్రసిద్ధమైన పత్రిక, ప్రభ, జ్యోతి వారపత్రికల తీరు గురించి లోతుగా చెబుతారు. ఈ మూడు పత్రికలు నేడు చరిత్ర దర్పణాలుగా పేరు మిగుల్చుకున్నాయి. మహిళలు, పిల్లలు కూడా చదువుకునేలా నార్ల ప్రభ వీక్లీను మలచారు. పిమ్మట అదే నార్ల జ్యోతి వీక్లీ ప్రారంభించినపుడు సైన్స్, క్రీడలకు సంబంధించి పెద్ద పీట వేశారని రామమోహనరావు విశ్లేషిస్తారు.
తాను సైన్స్ చదువుకోకపోయినా దానిపట్ల ఎంతో అభిమానముంది నండూరి వారికి. ‘ఆంధ్ర పత్రిక’ వీక్లీలో పలు సైన్స్ విషయాల గురించి ఎన్నో వ్యాసాలు రాశారు. నండూరి వారు తటపటాయించినా నార్ల ‘విశ్వరూపం’ కృషి కి శ్రీకారం చుట్టించారు. విశ్వానికి సంబంధించిన భౌతిక రూపం గురించి వివరించే విజ్ఞాన శాస్త్రమిది. అందరికీ బోధపడేలా ఉండాలని ప్రాథమిక విషయాలను కూడా పొందుపరుస్తూ ‘విశ్వరూపం’ కొనసాగించారు. హాయిగా చదివించే శైలి వారిని సైన్స్ రచయితగా చిరంజీవిని చేసింది. జీవ శాస్త్రాన్ని వివరించే పరిణామక్రమం ‘నరావతారం’. ఇదీ ప్రఖ్యాతమైనదే! లెక్కకు మించిన పరిశోధనలు ఈ రంగాలలో రావడంతో ఈ రచనలను క్రమం తప్పక సంప్రదించేవారు. అందువల్లనే ఈ రచనలు పుస్తకాలుగా కూడా విజయవంతమయ్యాయి.

‘విశ్వరూపం’, ‘నరావతారం’ – ఈ ప్రపంచం, మనిషి పరిణామం గురించి చర్చించగా – ‘విశ్వదర్శనం’ మనిషి ఆలోచనల పరిణామాన్ని చిత్రికపట్టింది. వీరి “రచనా ప్రణాళిక చక్కనిది” అని కుటుంబరావు అభినందించారు. అయితే నండూరి ఆ ప్రణాళిక దానికదే ఎవాల్వ్ అయిందని నాతో ఒక విజయవాడ ఆకాశవాణి పరిచయంలో పేర్కొన్నారు. ఇపుడు వారిని ప్రధానంగా చక్కని సైన్స్ రచయితగా గౌరవిస్తున్నాం.
ఏ ఉద్యోగం చేసినా ఎంతో కొంత కృషి ఉంటుంది. అయితే మీడియా వంటి ‘విజిబుల్’ రంగంలోని పరిశ్రమ సమకాలీన కాలంలో విశ్లేషించే అవకాశం లేదు. తర్వాతి తరంలో వారిని అధ్యయనం చేసే వీలు పెద్దగా ఉండదు. అందువల్ల నండూరి రామమోహనరావు సంపాదకుడిగా కాంట్రిబ్యూషన్ ఏమిటని పెద్దగా విశ్లేషించిన దాఖలాలు లేవు. అయితే సైన్స్ రచయితలకూ, సాహిత్య అనువాదకులకూ ఆరాధ్యనీయుడయిన కృషీవలుడు ఆయన. నార్ల, గోరాశాస్త్రికి సంబంధించిన మూడు అపురూపమైన గ్రంథాలు నాకు తన సొంత కాపీలు బహూకరించారు. ఆ మూడు పుస్తకాలు నా పాత్రికేయరంగపు పరిశోధనకు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఆ పుస్తకాలు నాకు కనబడిన ప్రతిసారీ నండూరి రామమోహనరావును గుర్తు చేస్తాయి!

(నండూరి రామమోహన రావు వర్థంతి సెప్టెంబరు 2)
డా. నాగసూరి వేణుగోపాల్
9440732392

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: