జూన్ 3, 2022

పెద్ద కథలకు ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం వద్ద 6:06 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం

లంకె

చివరి తేదీ: సెప్టెంబర్‌ 1, 2022.

ఈ ఆలోచన జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ఉన్నప్పుడు వచ్చింది.

దానికి ముందు కొంత నా నేపథ్యం కూడా ఉంది.

నేను కథలు రాయడం మొదలెట్టినప్పుడు రచయిత సౌదా ‘ఒక కథ దానంతట అది ఒక పేజీ వచ్చినప్పుడు ఒక్క పేజీయే రాయాలి. దానంతట అది 30 పేజీలు వస్తే 30 పేజీలు రాయాలి’ అని సలహా ఇచ్చాడు. అంటే అనవసరంగా కథను పెంచకూడదు… పేజీలు లేవని కుదించనూ కూడదు. వేర్లకు తగినట్టుగా ఎదగనివ్వాలి.

1995లో నేను కథలు మొదలెట్టినప్పుడు వీక్లీలు కనికరిస్తే తప్ప పెద్ద కథలకు వీలు లేదు. ఆంధ్రజ్యోతి, వార్త సండే మేగజీన్లు అప్పుడప్పుడు పెద్ద కథలను రెండు వారాల పాటు వేసేవి. ఈ పద్ధతికి నేను విముఖుణ్ణి. కథను పాఠకుడు సింగిల్‌ సిట్టింగ్‌లో చదవాలి. అందుకని 2002లో నేను పత్రికలలో పట్టని పెద్దకథ ‘ఖాదర్‌ లేడు’ రాసినప్పుడు మరో ఆలోచన లేకుండా పుస్తకంగా వేశాను. ఆ తర్వాత రాసిన పెద్ద కథలు ‘కింద నేల ఉంది’, ‘ఢాకన్‌’, ‘గెట్‌ పబ్లిష్డ్‌’… పత్రికల వైపు చూడకుండా నేరుగా విడివిడిగా పుస్తకాలు వేశాను. అలా చేసినా ఆ కథలు బతికాయి. నిజానికి బాగా బతికాయి.

కథ పుట్టడమే పెద్ద కథగా పుట్టిందని మనకు తెలుసు. గొగోల్‌ ‘ఓవర్‌ కోటు’ అచ్చులో 40 పేజీలు ఉంటుంది. అలాగని చిన్న కథ రాయడం చిన్న ప్రతిభతో కూడిన పని అని పెద్ద కథ రాయడమే సామర్థ్యం అని అర్థం కాదు. కాని ఒక వస్తువును ఒక్కోసారి సమగ్రంగా, గాఢంగా, ఆవరణ సహితంగా చెప్పాల్సి వచ్చినప్పుడు పరిమిత పుటల దృష్టి ఉంటే చెప్పలేము. కొన్ని కథలు చాలా పెద్ద రెక్కలను సాచి చాలా ఎత్తుకు ఎగరాలని చూస్తాయి. దశాబ్దాలు నిలబడతాయి. తెలుగులో కూడా ఎందరో రచయితలు అలాంటి పెద్ద కథలు రాశారు. శ్రీపాద ‘చిన్న కథలు’ అని చెప్పి చాలా పెద్ద కథలు చదివించారు. గురజాడ ‘మీ పేరేమిటి’, కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’, కల్యాణసుందరి జగన్నాథ్‌ ‘అలరాస పుట్టిల్లు’, అల్లం శేషగిరిరావు ‘చీకటి’, తిలక్‌ ‘నల్లజర్ల రోడ్డు’, నామిని ‘పాలపొదుగు’, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ‘పనిపిల్ల’, అల్లం రాజయ్య ‘అతడు’, శ్రీరమణ ‘మిథునం’ పెద్ద కథలే. అవి రాయడం వల్ల ఆ రచయితలకు వచ్చిన స్థాయి వేరు.

‘ఎవరు చదువుతారండీ పెద్ద కథలు’ అని కార్డు స్థాయికి కథలను దించినా కథ, పెద్దకథలే ఎప్పుడూ పాఠకులను ఆకర్షించాయి. ఎవరు చూస్తారండీ పాతిక రీళ్ల సినిమా అని 2 గంటలకు నిడివి కుదించినా– ఇవాళ ఓటిటిలలో లక్షల మంది వెబ్‌ సిరీస్‌లను చూస్తున్నారు. ఎనిమిది గంటలను ఒక్కో సిరీస్‌ కోసం వెచ్చిస్తున్నారు. అంటే సమర్థమైన విస్తృతికి, సృజనకు తప్పక వీలు ఉంటుంది. ఎప్పుడూ.

గత పదేళ్లుగా బాగా రాసే, సమర్థులైన కథకులను కలిసిప్పుడల్లా ‘పెద్ద కథ ఒకటి మైండ్‌లో ఉంది. రాసి ఎవరికి పంపాలో తెలియక రాయట్లేదు’ అని దిగులు పడటమే కనిపించింది. అలాగే ఈ తరంలోని యువ రచయితలు కూడా పెద్ద కథను నిలబెట్టగల, రాసి నిలబడగల సాధనను చేయాల్సి ఉంది.

మొన్నటి మార్చిలో జరిగిన జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ‘మీరేమిటి వెయ్యి, రెండు వేల పదాల కథలనే కథలు అంటుంటారా’ అని అక్కడకు వచ్చిన మరాఠీ రచయితలు అడిగినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు తెలుగు కథ సగటు పదాల సంఖ్య 1000 నుంచి 1500 మాత్రమే. అందువలన తెలుగులో పెద్దకథ చివరి చూపుల్లో ఉంది అని చెప్పలేకపోయాను. మరాఠి రచయితలు దీపావళి సంచికల్లో ఇవ్వడానికే సంవత్సరం మొత్తం రెండో, మూడో పెద్ద కథలు రాసి సిద్ధంగా ఉంచుకుంటారు. ఇవాళ్టికీ మహరాష్ట్రలో దీపావళికి 250కి పైగా ప్రత్యేక సాహిత్య సంచికలు వస్తున్నాయి. వాటిలో 3 వేల పదాల నుంచి 10 వేల పదాల పెద్ద కథలను వేస్తారు. వాటికే ప్రత్యేకంగా పాఠకులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పెద్ద కథ రాయగలిగిన రచయిత(త్రి)నే ‘సామర్థ్యం ఉన్న రచయితగా గుర్తించే’ భావధార ఉంది. మన దగ్గర కూడా దీపావళి సంచికలు, ఇండియా టుడే సాహిత్య సంచికలు పెద్ద కథకు చోటు కల్పించేవి. కాని నేడు సకలం నశించినవి.

కనుక ఇది ఒక ప్రయత్నం. ఇకపై ప్రతి సంవత్సరం పెద్ద కథల సంకలనం ఒకటి వస్తుంది. ఈ సంవత్సరం రాబోయే సంకలనం కథకుల పెద్ద కథలకై ఆహ్వానం పలుకుతూ ఉంది. హేమాహేమీల నుంచి యువ కథకుల వరకు ఎవరు ఏ పెద్ద కథ రాస్తారోనన్న కుతూహలంతో ఎదురు చూస్తూ ఉంది. షరతులు–

– కథ చదివించగలగడం మొదటి షరతు.
– 2500 పదాల నుంచి 5000 పదాల వరకూ నిడివి ఉండొచ్చు. అంటే 2500 పదాల లోపు ఉన్న కథలు ఈ సంకలనానికి అర్హమైనవి కావు.
– వస్తువు, భాష, ప్రాంతం పై ఎటువంటి షరతులు లేవు.
– కథను కంపోజ్‌ చేసి మాత్రమే పంపాలి.
– అక్టోబర్‌లో దీపావళి కనుక అక్టోబర్‌ మొదటివారం సంకలనం మార్కెట్‌లో ఉంటుంది.
– కథలను రేపటి నుంచి సెప్టెంబర్‌ 1, 2022లోపు peddakatha2022@gmail.com మెయిల్‌కు పంపొచ్చు.
– సంకలన ఉద్దేశ్యాన్ని, సాహితీ ప్రమాణాలను చేరని కథలు రిజెక్ట్‌ అవుతాయని ప్రత్యేకం చెప్పనక్కర్లేదు.
– 300 పేజీల సంకలనం ఇది. అంటే ఎంపికకు పేజీల పరిమితి ఒక అవరోధమేనని గుర్తించాలి.
– ప్రతి కథ సీనియర్‌ చిత్రకారుల బొమ్మలతో, విమర్శకుల వ్యాఖ్యతో, రచయిత పరిచయంతో తీర్చి దిద్దబడి కథావరణానికి ఒక విలువైన చేర్పుగా పాఠకులకు అందుతుంది.

ఈ ప్రకటనను తెలుగు ప్రాంతాలలో, ప్రవాసంలో ఉన్న రచయితల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కథాభిమానులకు విన్నపం. నమస్తే.

– మహమ్మద్‌ ఖదీర్‌బాబు
జూన్‌ 2, 2022.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: