మే 4, 2022

సంచిక – స్వాధ్యాయ సాహిత్య సమావేశం

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం వద్ద 10:19 ఉద. ద్వారా వసుంధర

సంచిక రైటర్స్ గ్రూప్ (వాట్సాప్) సౌజన్యంతో

ఇది ఒక విభిన్న విశిష్ట ప్రయోజనాత్మక సమావేశం. ఇవి రచయితలు, పాఠకులు తప్పక చదవాల్సిన వివరాలు. ఇది అభినందించాల్సిన కృషి – అక్షరజాలం

సంచిక – స్వాధ్యాయ రచయిత మొదటి సమావేశం స్వాధ్యాయ రిసోర్స్ సెంటర్‍లో 01 మే 2022 నాడు జరిగింది.
విశిష్ట అతిథి: శ్రీ కోవెల సుప్రసన్నాచార్య
పాల్గొన్నవారు: శ్రీయుతులు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, ఎ.ఎమ్. అయోధ్యా రెడ్డి, డా. కె.ఎల్.వి. ప్రసాద్, శ్యామ్ కుమార్ చాగల్, తోట సాంబశివరావు, శ్రీమతి సి.హెచ్. సుశీల, శ్రీమతి లలిత చండీ, బి. మురళీధర్, శ్రీమతి బొమ్మదేవర నాగకుమారి, పి. జ్యోతి, మున్నూరు నాగరాజు, గండ్రకోట సూర్యనారాయణ, డా. రాయపెద్ది వివేకానంద, గుండాన జోగారావు, వేదాల గీతాచార్య, శ్రీమతి నండూరి సుందరీ నాగమణి, గండ్రకోట సూర్యనారాయణ, సి.ఎస్. రాంబాబు, గొర్రెపాటి శ్రీను, డా. చిత్తర్వు మధు, సలీం, కస్తూరి మురళీకృష్ణ, కొల్లూరి సోమ శంకర్ మరియు కోవెల సంతోష్ కుమార్.
~
కస్తూరి మురళీకృష్ణ రచయితలని ఆహ్వానించి, ఎజెండా వివరించి – శ్రీ కోవెల సుప్రసన్న గారిని పరిచయం చేశారు. సంచిక స్వాధ్యాయ సంయుక్త కృషిని క్లుప్తంగా వెల్లడించారు. రచయితలందరూ సంచికకు సమానమేననీ, ఇక్కడకి వచ్చిన వారందరూ మాట్లాడాలని కోరారు.
~
కోవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ కథ అనేది ప్రారంభ కాలం నుంచి ఉందని, కాకపోతే వేరు వేరు రూపాలలో ఉందని అన్నారు. తన అనుభవాన్ని చెప్పడానికి ఆకృతి కథ అన్నారు. అనుభవాన్ని పాడితే కావ్యం/గేయం అనీ, అప్పుడు అనుభూతి ఛందస్సులోకి ఒదిగినట్లని అన్నారు. అభినయం ద్వారా చెబితే బుర్రకథ, యక్షగానం అవుతాయని అన్నారు.
తల్లి పిల్లలకి కథలు చెబుతుందని, ప్రేయసీప్రియులు ఒకరిఒకరు కథలు చెప్పుకుంటారనీ – జీవితం కథలతోనే ప్రారంభమని అన్నారు.
విష్ణుశర్మ పంచతంత్రం నాటి నుంచే కథలు ఉన్నాయన్నారు. కథల రూపాలు అనేకం అన్నారు, ఉదాహరణగా కథాసరిత్సాగరంను పేర్కొన్నారు. ఇవన్నీ అడిగితేనే చెప్పే కథలని చెప్పారు. శుక మహర్షి భాగవతాన్ని వినిపించాడనీ, వైశంపాయనుడు భారతం వినిపించాడని చెప్పారు.
కథా రూపం క్రమక్రమంగా మారుతోందని, అది సజీవ లక్షణమని అన్నారు. మనిషి జీవితంలో అనేక పరిణామాలు సంభవిస్తున్నట్టే, కథారూపం కూడ వికసిస్తూ వచ్చించని చెప్పారు.
ఒక కథ చెప్పుకోవడంలో భావ తీవ్రత, ప్రతీకాత్మకత, శైలి ఉంటాయనీ, తాదాత్మ్యత ఉంటుంది. అప్పుడు కథ స్వరూపం తెలుస్తుంది. కిన్నెరసాని పాటలు ఉదాహరణగా పేర్కొన్నారు.
ఒక కథ చెబితే అందులోంచి ఎవరికి వారి తీసుకోవాల్సిన ఆదర్శాలు, ఔన్నత్యాలు ఎలా తీసుకోవాలో అర్థమయ్యేలా కథ చెప్పాలి. కథలో ఉండే పలు పార్శ్వాలు చూడాలి.
“విశ్వనాథ వారి ‘జీవుని ఇష్టం’ నాకు చాలా ఇష్టమైన కథ. ఎప్పుడు చదివినా నాకు ఒళ్ళు జలదరిస్తుంది” అన్నారు.
కథ చదివినప్పుడు కలిగే ప్రేరణ గొప్పది. ఏ కథ చదివినా హృదయానికి హత్తుకుని, ఎన్ని రోజులైనా మరిచిపోకుండా ఉండాలి. అది గొప్ప కథ అవుతుంది. అలాంటివి రావాలి – అన్నారు సుప్రసన్నాచార్య.
*
సెషన్-1:
చర్చాంశం: ఎందుకని పాఠకులని ఆకట్టుకోలేకపోతున్నాము? కొత్త పాఠకులను చేరడమెలా?
~
తుమ్మేటి రఘోత్తమరెడ్డి:
అందరికీ నమస్కారం. అచ్చుపత్రికలు తగ్గి వెబ్ పత్రికలు/సోషల్ మీడియా పెరిగిన ఈ కాలంలో రచయితలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి. ఈ తరం వాళ్ళు డిజిటల్ మీడియాలోనే ఉంటున్నారు. మనం కూడా సోషల్ మీడియాని రచనా వ్యాసంగానికి ఉపయోగించుకోవాలి. పిల్లలు కథలు చదవడం లేదు, కానీ తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మనం వాళ్ళతో కలిసి నడవాలి.
కొందరు కథలు ఇలా రాస్తేనే కథలు, ఆ విధంగా రాస్తేనే కథ రాసినట్టు అనే అభిప్రాయంలో ఉంటారు. మనవాళ్లు rigid అయిపోయారు. రాయడం అంటే కథ, నవల, కవిత్వమే అని అనుకుంటున్నారు. ఇంకా ఉన్నాయి. నేను ఫేస్‌బుక్‌లో రాశాను. చాలామంది చదివారు.
మనం మన perspective మార్చుకోకుండానే సాధన చేయవచ్చు. మన ముందు తరం, మన తరం, మన తర్వాతి తరం – మొత్తం మూడు తరాలకి చేరేలా రాయాలి. వారితో నడుస్తూ వారి expression, వారి భాషని గ్రహించాలి. Update అవ్వాలి.
ఎ.ఎం. అయోధ్యా రెడ్డి:
నమస్కారం. నాకు మాట్లాడడం రాదు. అసలు కథలు ఎందుకు రాయాలి అనడంలో ఎంతో బాధ ఉంది, దుఃఖం ఉంది. పాతికేళ్ళ క్రితం రచయితలు చాలా తక్కువ, పాఠకులు బాగా ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు ఎక్కువమంది రచయితలే, పాఠకులే తక్కువ.
మా అబ్బాయి చదవడు. మొన్న శ్రీశ్రీ జయంతి సందర్భంగా శ్రీశ్రీ ప్రస్తావన వస్తే ‘ఆయన ఎవరు పాప్ సింగరా?’ అని అడిగాడు. ఇంక ఏం చెప్పాలి?
ఇప్పుడు కథ చదవడానికి కూడా ఓపిక లేదు. మనం రాస్తున్నాం, కాని ఎవరు చదువుతున్నారు? అని ప్రశ్నించుకోవడం లేదు. మన సంతృప్తి కోసం మనం రాస్తున్నాం. మనమే ఇంకొకళ్ళ రచనలని చదవం అనేది ఫాక్ట్. మరి పాఠకులు ఎలా వస్తారు?
పాఠకులను పెంచడం ఎలా అనేది ఆలోచించాలి. మిమ్మల్ని నిరాశపరచడం నా ఉద్దేశం కాదు. రైటర్స్, కవులు చాలామంది ఉన్నారు. పాఠకులే కావాలి. దాని కోసం ఏం చేయాలో ఆలోచించాలి.
డా. కె.ఎల్.వి. ప్రసాద్:
నమస్కారం. కథలు చదవడం లేదు అన్నారు అయోధ్య రెడ్డి గారు. చదివే వాళ్ళు ఉన్నారనే నా అభిప్రాయం. నేను ఎంతో మందితో చదివిస్తాను. రాయలేని వాళ్ళకి ఓ చేయి అందించడంలో తప్పులేదు. పాఠకులు ఉన్నారు. ఒక టైమ్ లో కథ, ఒక టైమ్‍లో నవలకి ప్రాముఖ్యత ఉంటోంది. మరి రేపెట్లా? కొత్త పాఠకులని ఎలా ఆకర్షించాలి?
పరిస్థితులు మారాయి అప్పట్లో అచ్చు పత్రికలకున్న ప్రాధాన్యత ఇప్పుడు లేదు.
మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని burning issues తో రాస్తే చదివేవారు వస్తారు.
శ్యామ్‍కుమార్ చాగల్:
పాఠకులని వివిధ రకాల రచనలతో ఆకర్షించాలి. ఏ వయసు వారికి ఆ వయసు వారి కథలే నచ్చుతాయి. అయితే ఇప్పుడు చదివేవారంతా above 45 వారే. యూత్ చదవడం లేదు.
ప్రేమ కథలు రాయాలంటే ఇప్పటి పిల్లల ఇంటరాక్షన్ మనకి తెలియదు. ఈ barrier దాటితే అందరినీ చేరవచ్చు.
తోట సాంబశివరావు:
నమస్కారం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను నా సంతృప్తి కోసమే రాస్తున్నాను. బహుమతులు రావాలని, పొగిడించుకోవాలనే ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. నా కథల్లో నేనే ఉంటాను. ఎక్స్‌పెక్టేషన్స్ లేవు, అసంతృప్తి లేదు.
సంచికలో ప్రచురితమైన రచనలు నా గ్రూపుల్లోని 5000 మందికి పంపితే, 100 మంది రెస్పాన్స్ ఇస్తారు.
ఎక్కువ మందికి పంపాలి, ఎవరో వస్తారని ఎదురు చూడకూడదు. Add friends అనేది నా పాలసీ. ఆ తృప్తి చాలు.
సి.హెచ్.సుశీల:
కథలనేవి సహజంగా ప్రతీ తల్లీ తన బిడ్డలకి చెబుతుంది. సంతోషం, ఆనందం అనుభవాల మధ్య కథా సాహిత్యం ఉన్నది.
అయితే రానురానూ పాఠకుల సంఖ్య తగ్గిపోతోంది.
విద్యార్థులు సాహిత్య పుస్తకాలు చదవడం లేదు. పర్సనాలిటీ డెవలప్‍మెంట్, కెరీర్ ఓరియంటెడ్, స్పిరిట్యువల్ బుక్స్ మాత్రమే చదువుతున్నారు. పబ్లిషర్స్ కూడా అలాంటి పుస్తకాలే ఎక్కువ ప్రచురిస్తున్నారు.
పాఠకులను ఎందుకు చేరుకోలేకపోతున్నాం అనేది కఠినమైన ప్రశ్న.
మంచి కథ ఎప్పటికీ నిలుస్తుంది. సమాజానికి మేలు చేకూర్చడం రచన బాధ్యత.
20/30 ఏళ్ళ క్రితం ఎలాంటి సీరియల్స్ వచ్చేవో అందరికీ తెలుసు.
యువ రచయితలకి ప్రోత్సాహం ఇవ్వాలంటే సీనియర్ రచయితలు తప్పుకోవాలి. చదివించాలంటే youngsters ని ప్రోత్సహించాలి. చదివించేలా రాస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి.
లలిత చండీ:
నేను ముందుగా పాఠకురాలిని. వంద కథలు చదివితే గాని ఒక కథ రాయలేము. 16 ఏళ్ళకే ఒక నవల రాసి పోటీకి పంపాను. అది తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత కొంత కాలం ఆపి, మళ్ళీ ఈ మధ్యే రాయడం మొదలుపెట్టాను. నాకు నా వృత్తి లోనే సంతృప్తి ఉంది.
చదవడానికి భాష రావాలి. నేటి తరం పిల్లలకు తెలుగు చదవడం లేదు.
కథలు చెప్పడానికి, నేటి సాంకేతికతని ఉపయోగించుకోవాలి.
తమ పిల్లలకి తాము చదవడం నేర్పించారా అని రచయితలు ప్రశ్నించుకోవాలి.
తెలుగు రాకపోవడమే పెద్ద ఇబ్బంది. నేను ఆడియో బుక్స్ వింటాను. ఆడియో బుక్స్ అందిస్తే మరికొంత మందిని చేరవచ్చు.
బి. మురళీధర్:
1987 నుంచి రాస్తున్నాను. గత 35 ఏళ్ళలో 25 కథలు రాశాను.
యూత్‍ని ప్రోత్సాహించాలి అంటే ఎంతో ఆశావహ దృక్పథం కావాలి. ఇది సంధి సమయం.
యూత్‍ని ఈ వైపు తిప్పడం కోసం కళాశాల విద్యార్థులకు కథ, కవితల పోటీ నిర్వహించాను. కానీ ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. మా జిల్లా రచయితల పేర్లు టీచర్లకీ, స్టూడెంట్స్‌కీ తెలియదు. (వారసుడు అని తను రాసిన కథ గురించి వివరించారు). మంచి పాత రచనలను మళ్ళీ వెలుగులోకి తేవాలి. క్షేత్ర స్థాయిలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. కాలేజీ విద్యార్థులకు పోటీలు నిర్వహించడం ఒక ఆలోచన.
బొమ్మదేవర నాగకుమారి:
1987 నుంచి రాస్తున్నాను. అప్పట్లో సాహిత్యం ఒక్కటే వినోదమార్గం. వినోదానికి పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఇంట్లో ఒక్క పుస్తకం ఉంటే కొత్త ప్రపంచాన్నే సృష్టించుకునేవాళ్ళం. టివి రావడంతో పుస్తక పఠనం తగ్గింది. కెరీర్ అవకాశాల కోసం అమెరికా వెళ్ళడం సులువవడంతో – రీడింగ్‍ తగ్గింది. సాహిత్యానికి ఇక్కడ గండి పడింది. అయితే ఇప్పుడు అక్కడ చదువు విలువ తెలుసుకుని హారీ పోటర్ వంటివి తెగ చదువుతున్నారు.
జెనరేషన్ మారుతోంది. పుస్తకం ఎంత ముఖ్యమో మనకి తెలుసు. రాయడానికి వయోపరిమితి పెడితే యూత్ ముందుకు వస్తారేమోనని నా అభిప్రాయం.
పి. జ్యోతి:
పాఠకులు దొరకడం లేదు అనే కన్నా, పాఠకులని మనమే సృష్టించుకోవాలి. ఫేస్‌బుక్‌లో నా ఆర్టికల్స్ చదివేవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు.
విలువలకి కట్టుబడి, మన దృక్పథంపై గట్టిగా నిలబడితే పాఠకులు ఉంటారు.
మెదడుకి పని చెప్పేది మంచి సాహిత్యం. వికారాలు కలిగించేది మంచిది కాదు. హృదయంలో కదలికలు తేగలిగేది మంచి సాహిత్యం.
నేను పిల్లలని ప్రోత్సహించాను. పిల్లలకి సాహిత్యం గురించి చెప్పాలంటే నేను సినిమాల ద్వారా చెప్పాను (పూజా ఫలం సినిమా – మునిపల్లె రాజు గారి నవల గురించి వివరించారు).
మున్నూరు నాగరాజు:
నేను ఇప్పటి తరం ప్రతినిధిని. మార్కెటింగ్ రంగంలో ఉన్నాను కనుక కస్టమర్ జర్నీపై అవగాహన ఉంది. కన్నడ సాహిత్యం కూడా పరిచయం ఉంది. పంచతంత్ర కథలతో ప్రారంభించి చాలా చదివాను. లైబ్రరీలలో కూచుని చదివేవాడిని.
విద్యార్థిగా ఉన్నతను – పాఠకుడిగా మారే ప్రాసెస్ ఉందా?
ఫోన్ లేకపోతే బతకలేనితరం ప్రస్తుత తరం. అప్పట్లో పుస్తకాలు చదివేవారు, ఇప్పుడు ఫోన్‌లో చదువుతున్నాను. చదివే మాధ్యమం మారింది.
40-60% చదవడం వచ్చిన వారు పుస్తకాలు చదువుతున్నారు. చదవడం తక్కువ వచ్చిన వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. మేధావులు ట్విటర్‍లో ఉన్నారు. వీరిలో మీ పాఠకుడెవరో గుర్తించాలి.
యూట్యూబ్ కథలు, ఇతర డిజిటల్ మీడియా పద్ధతులను పరిశీలించాలి. పాఠకులను చేరే మార్గం కనబడుతుంది.
ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా రాయగలిగితే చదువుతారని నా నమ్మకం. ఈ పుస్తకం చదివితే నాకు లాభం ఉంది అని ఫీలయితే పాఠకులు తప్పక చదువుతారు.
యువత త్వరగా కనెక్ట్ అయితేనే రచనలు ఎక్కువ పాఠకులకి చేరుతాయి.
Neglected Youth ని వదిలి elite readers కోసం ప్రయత్నిస్తే ప్రయోజనం ఉండదు (పుష్ప, కెజిఎఫ్2 సినిమాలు ఉదాహరణ చెప్పారు).
డా. వివేకానంద రాయపెద్ది:
నేను రచయిత కన్నా ముందు పాఠకుడిని. నా అభిప్రాయంలో పాఠకులు ఎక్కడికీ పోలేదు. ఇంకా పెరిగారు.
ఎప్పుడూ Today is the best day అని అనుకోవాలి. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడూ నిత్య ఉత్సాహంతో ఉంటారు. రచయితలందరూ అలాంటి మైండ్‌సెట్‌లో ఉండాలి.
ప్రస్తుత తరం వారు ఎవరిని ప్రోత్సహిస్తున్నారో గమనించుకోవాలి.
ఆడియో బుక్స్ అవసరం (కిరణ్ ప్రభ గారి గురించి చెప్పారు).
పాఠకులు ఏ పంథా ద్వారా రసాస్వాదన చేస్తున్నారో గమనించుకుని ఆ పంథాలో ముందుకు సాగాలి.
గుండాన జోగారావు:
నేను ఖరగ్‍పూర్ వాసిని. ప్రస్తుతం పఠనం తగ్గి, వీక్షణం పెరిగింది. శ్రోతలు పెరిగారు, పాఠకులు తగ్గారు.
పత్రికలలో వస్తున్న పెద్ద కథలు ఇప్పుడు ఎవరూ చదవడం లేదు. చిన్న కథలే చదువుతున్నారు.
వ్యంగ్యం, హాస్యం చక్కగా ఉన్న కథలు వాట్సప్‍లో వస్తున్నాయి. పాఠకులలో సాహిత్యం పట్ల ఆసక్తి పెంచాలంటే ఆడియో బుక్స్ తేవాలి.
కథలని ఆడియో బుక్స్‌గా తెస్తే సరికొత్త పాఠకులని చేరుకోవచ్చని నా అభిప్రాయం.
ప్రతీ కాలేజీలోనూ విద్యార్థులకి/తెలుగు లెక్చరర్లకీ ‘కథా పఠనం’ ఒక తప్పనిసరి కార్యక్రమంగా పెట్టాలి. పుస్తకాలు ఇచ్చి చదివించాలి. రీడింగ్ సెషన్‍లు పెట్టించాలి. పుస్తకాలను కానుకలుగా ఇవ్వాలి.
అలాగే కథల పోటీలలో మూస ఇతివృత్తాలకు బహుమతులు ప్రకటించకూడదు. న్యాయనిర్ణేతలుగా అకడమీషియన్లను కాకుండా కథకులనే పెట్టాలి.
వేదాల గీతాచార్య:
చదివే వాళ్ళు ఉన్నారు, కానీ చదివించే విధంగా రాసేవాళ్ళు ఎందరు? పిల్లలని సాహిత్యం చదివించాలంటే ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. ఆ నమ్మకం, వాతావరణం ఉండాలి.
విభిన్నమైన కథలని ప్రోత్సహించాలి. అలాంటివి రాస్తే ప్రచురిస్తారన్న నమ్మకం ఉండాలి. పాఠకులని రచయిత గుర్తించాలి.
తెలుగు కథలలో వెర్సటాలిటీ బాగా తగ్గింది. Style పోయింది, Repeatition ఎక్కువైంది (ఉదాహరణగా ‘వెన్నెలసోన’ అనే పదం గురించి చెప్పారు).
మూసలు/టెంప్లేట్స్ బద్దలు కొట్టలేకపోతున్నాం.
గండ్రకోట సూర్యనారాయణ:
పాఠకులు రూపాంతరం చెందారు. ఇప్పటి పిల్లలకి తెలుగు చదవడం రాదు. ఆడియో అడుగుతున్నారు.
పుస్తకం – పోన్ లోనూ, ఆడియో లోను లభ్యమయితే పాఠకులు పెరుగుతారు.
సలీం:
పాఠకులు పెరగాలంటే ఇంజనీరింగ్/మెడిసిన్‍లలో కూడా లిటరేచర్ ఉండాలి. సాహిత్యం వల్ల హృదయ వైశాల్యం పెరుగుతుంది. అది పిల్లలకి మేలు చేస్తుంది.
మూస కథలని విభిన్నంగా వ్రాస్తే ప్రచురించే పత్రికలు లేవు (సొంత కథ ‘అజా’ అనుభవం చెప్పారు). మంచి కథ అయినా ప్రచురించడం లేదు.
జూనియర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సీనియర్స్ కూడా రాయాలి. యువకులకి/సీనియర్స్‌కీ విడిగా ప్రైజ్‍లుండాలి.
సి.యస్. రాంబాబు:
Transformation of readers has happened.
చదివే మీడియం మారిపోయింది. తెలుగు మీడియం దాదాపుగా లేదు.
80లలో తెలుగుకి బదులుగా ద్వితీష భాషగా సంస్కృతం ఎంచుకునే అవకాశం కల్పించినప్పుడు సమస్యకి బీజాలు పడ్డాయి. తెలుగు వారికి తమ భాషపై ప్రేమ తక్కువ.
పత్రికలలో యువతకి పత్యేక కాలమ్‍లు, ప్రత్యేక పేజీలు కేటాయించాలి. సగటు పాఠకుడి వయసుని తగ్గించ గలిగితే కొత్త పాఠకులు వస్తారు.
గొర్రెపాటి శ్రీను:
నేను కూడా మొదట పాఠకుడినే, చిన్నప్పటి నుంచి విస్తృతంగా చదివేవాడిని. మా నాన్నగారి ప్రోత్సాహం ఎంతో ఉంది (తమ స్వీయ అనుభవాలు చెప్పారు).
ప్రింట్ పత్రికలు తగ్గి ఆన్‌లైన్/డిజిటల్ మీడియా పెరిగిన ఈ రోజుల్లో – కథల/కవితల లింక్‌లను వీలైనంత ఎక్కువగా షేర్ చేసుకుంటే పాఠకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేటి పాఠకులను అనుగుణం శైలిని మలచుకోవాలి.
డా. చిత్తర్వు మధు:
పోటీలు మరిన్ని పెడితే ప్రయోజనం ఉంటుందని నా భావన.
పాత తరం ఎడిటర్లు – రచయితలని ఎంతో ప్రోత్సహించేవారు.
సినిమాలకైనా, నాటకాలకైనా కథే ముఖ్యం.
ఈ రోజుల్లో ప్రచారం చాలా ముఖ్యం. కథకుల ఫేస్‍బుక్ లైవ్ లేదా జూమ్ మీటింగ్‌లలో వీలైనంతగా సమావేశం అవ్వాలి.
ఏ జానర్ రాసేవాళ్ళు, ఆ జానర్‍లో శిక్షణ ఇవ్వాలి. సొల్యూషన్ ఇవ్వాలి.
రచయితకి దృక్పథం ఉండాలి. అప్పుడే పాఠకులను చేరుకోవచ్చు.
నండూరి సుందరీ నాగమణి:
1990ల నుంచి రాస్తున్నాను.
పాఠకులను రీచ్ అవడం ఎలా? ఏ జానర్‌ తీసుకున్నా ఆకట్టుకునే రీతిలో రాయగలగాలి. శైలి ముఖ్యం. అది బావుంటే ఎవరినైనా ఆకట్టుకోవచ్చు.
పత్రికల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఫేస్‌బుక్‌లో కూడా రాసుకోవచ్చు. వాక్య నిర్మాణం సరిగా ఉండాలి. క్లుప్తంగా ఉండాలి.
కొల్లూరి సోమ శంకర్:
రచయిత పాఠకుల మధ్య కమ్యూనికేషన్ ఉంటే – దాని ద్వారా ఒక పాఠకుడు మరింత మందిని రచయితకి పరిచయం చేయగలడు. (సలీం గారితో తన అనుభవాన్ని వివరించారు)
ఆధునిక కాలంలో రచయిత పాఠకులతో ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా లేదా ఇతర డిజిటల్ మీడియా పద్ధతులతో టచ్‍లో ఉంటే ఏర్పడే సుహృద్ భావన ఆ పాఠకుడి ద్వారా మరికొంత మంది కొత్త పాఠకులను తెచ్చే అవకాశం ఉంటుంది.
~
కస్తూరి మురళీకృష్ణ ఈ చర్చని సంగ్రహంగా వివరించారు.
అనంతరం సెషన్ ముగింపు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారి మాటలతో ముగిసింది.
“70 సంవత్సరాల వెనక్కి వెళితే నేనూ పాఠకుడినే. ఆ రోజుల్లో మేము వినేవాళ్ళం. కావ్యాలు/కవితలు పఠిస్తుంటే మేం వినేవాళ్ళం.
రచయిత కథ/నవల/కవిత్వం – చదివి వినిపించే సంప్రదాయం ఉండాలి.
మాది ఉర్దూ మీడియం. అప్పట్లో గ్రంథాలయ ఉద్యమం ఉండేది. మా రోజుల్లో తెలుగు భాషను ప్రజలే రక్షించుకున్నారు. ఆ రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రోజు ప్రజలే తెలుగు భాషను వద్దంటుకున్నారు. ఇప్పుడు తెలుగు కోసం మరో ఉద్యమం రావాలేమో అని అనిపిస్తోంది.
ప్రజలకు సాహిత్యానికి మధ్య వంతెనగా ‘సాహిత్య పఠనం’ ఉండాలి. అలాంటివి సంచిక, స్వాధ్యాయ చెయాలి. నెల కొకసారి చదివి వినిపించాలి.
Reciter Organization అవసరం అని నాకు తోచింది. ప్రజల భాష నశించకూడదు.”
~
భోజనాల వేళ అవడంతో సెషన్-1 ముగిసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: