ఆగస్ట్ 31, 2020
షార్ట్ ఫిల్మ్ పోటీలు
ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ‘షార్ట్ ఫిల్మ్ పోటీలు’
గుంటూరు:
ఆంధ్రప్రదేశ్ మద్యవిమోచన ప్రచార కమిటీ (ఏపీఎం పీపీసీ) ఆధ్వర్యంలో లఘుచిత్రాలు (షార్ట్ ఫిల్మ్) పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వెల్లడించారు. శుక్రవారం స్థానిక కొరిటెపాడు రామన్నపేటలో ఏపీ ఎంవీపీసీ ప్రభుత్వ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మద్యం మహమ్మారి దుష్ప్రభావాలు.. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న దశలవారీ మద్య నిషేధం’ అనే టాపిక్ పైన షార్ట్ ఫిల్మ్ లు తీయాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో మద్యం నియంత్రణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. మద్యం బెల్టు దుకాణాలు తొలగింపు, పర్మిట్ రూమ్ లు రద్దు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న మద్యం దుకాణాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని నిర్వహించడం, దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించడం, ధరల పెంపుతో మద్యం వినియోగం తగ్గించడం, మద్యం విక్రయ వేళల నియంత్రణ, డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుతో మద్యం వ్యసనపరులతో దురలవాట్లు మాన్పించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చడం.. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో అక్కాచెల్లెమ్మల కళ్లల్లో ఆనందం వెల్లివిరియడం.. వ్యసనాల బారి నుంచి విముక్తి పొందిన వారు ఇంటిల్లి పాది కుటుంబంతో గడుపుతూ కళకళలాడుతూ మద్యరహిత ఆంధ్రప్రదేశ్ అవతరించే వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్న అంశాలను మాత్రమే షార్ట్ ఫిల్మ్ లు తీయాల్సి ఉందని లక్ష్మణరెడ్డి వివరించారు. ఐదు నిముషాల నిడివితోనే షార్ట్ ఫిల్మ్ తయారు చేయాల్సి ఉందన్నారు. ఇంట్లో జాగ్రత్తగా ఉండి వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలతో మాత్రమే షార్ట్ ఫిల్మ్ తీయాలన్నారు. ప్రభుత్వ లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని నిబంధనలను ఉల్లంఘిస్తే ఏపీ ఎంవీపీసీకి ఎటువంటి బాధ్యత ఉండదన్నారు. తెలుగు భాషలో మాత్రమే ఫిల్మ్ తయారు చేయాలన్నారు. పోటీల్లో పాల్గొన్న ఉత్తమ 15 షార్ట్ ఫిల్మ్ లను ఎంపిక చేసి.. వాటిల్లో నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకింద బెస్ట్ 5 ఫిల్మ్ ల చొప్పున ఎంపిక జేయడం జరుగుతుందన్నారు. ప్రథమ బహుమతి వరుసలో ఉన్న బెస్ట్ 5 ఫిల్మ్లు ఒక్కోదానికి రూ.10వేల నగదు, ద్వితీయ బహుమతి వరుసలో ఉన్న బెస్టు 5 ఫిల్మ్ లు ఒక్కోదానికి రూ. 7,500 నగదు, తృతీయ బహుమతి వరుసలో ఉన్న బెస్టు 5 ఫిల్మ్ లకు ఒక్కోదానికి రూ. 5 వేల చొప్పున నగదు అందజేస్తామని వివరించారు. వీరితో పాటు ఉత్తమ దర్శకత్వంకు రూ.5వేలు, ఉత్తమ రచనకు రూ.5వేలు, ఉత్తమ నటుడుకి రూ.5వేల నగదు ఉంటుందన్నారు. విజేతలకు నగదు పారితోషకంతో పాటు ప్రభుత్వం తరఫున ప్రశంశా పత్రం, జ్ఞాపిక ప్రదానంతో పాటు సత్కారం ఉంటుందని లక్ష్మణరెడ్డి వివరించారు. షార్ట్ ఫిల్మ్ లు పంపడానికి ఆఖరుతేదీ సెప్టెంబర్ 25 కాగా విజేతల ప్రకటన సెప్టెంబర్ 28న ప్రకటిస్తామన్నారు. అక్టోబర్ 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి రోజున విజేతలకు బహుమతుల ప్రదానంతో సత్కార కార్యక్రమం నిర్వహిస్తామని లక్ష్మణరెడ్డి వివరించారు. ఎంట్రీ ఫీజు ఉచితమని.. పోటీలకు పంపే షార్ట్ ఫిల్మ్ జనవరి 2020 నుంచి 25 సెప్టెంబర్ 2020లోగా షూటింగ్ చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు చెందిన వారితో పాటు తెలంగాణ ప్రాంతవాసులు కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఇంతకుముందు ఎలాంటి పోటీలకు పంపకుండా.. యూట్యూబ్లో అప్లోడ్ చేయని తాజా ఫిల్మ్ లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. షార్ట్ ఫిల్మలను apmvpc.gov.in@gmail.com మెయిల్ కి పంపాలన్నారు. మరింత సమాచారం కోసం ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ పీఆర్వో పొగర్తి నాగేశ్వరరావును 9381243599 నెంబర్ ద్వారా సంప్రదించాలన్నారు.
– వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి,
చైర్మన్,
మద్యవిమోచన ప్రచార కమిటి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
9949930670.
స్పందించండి